50 ఏళ్ల కిందటి విమానం జాడ దొరికింది!
బ్యూనస్ ఎయిర్స్: దాదాపు అర్ధశతాబ్దం కింద కూలిపోయిన విమానం జాడ తాజాగా బయటపడింది. 1964లో అర్జెంటినాలో ఈ విమానం కూలిపోయినట్లుగా గుర్తించినా దాని జాడ మాత్రం ఇప్పటిదాకా తెలియలేదు. కోల్హూ హువపి అనే సరస్సు ఎండిపోవడంతో ఈ విమాన శకలాలతోపాటు అందులో ప్రయాణించిన నలుగురి అస్థిపంజరాలు బయటపడ్డాయి. 1964, అక్టోబర్ 9న పైపర్ అపాచే విమానం కూలినట్లుగా ప్రకటించిన అర్జెంటినా ప్రభుత్వం దాని జాడ తెలుసుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.
కాగా స్థానికుడొకరు విమాన శకలాలకు సంబంధించిన సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లి పరీక్షించిన అధికారులు.. 50 ఏళ్ల క్రితం కూలిపోయిన పైపర్ అపాచే విమాన శకలాలుగా గుర్తించినట్టు అర్జెంటినా జాతీయ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.