లండన్ భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి
లండన్ : అగ్నిప్రమాదానికి గురైన గ్రెన్‌ఫెల్ టవర్ దుర్ఘటనలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా మంటలు అంతకంతకు ఎగసిపడుతున్నాయి. ఈ టవర్‌లో మొత్తం 120 ఫ్లాట్స్ ఉండగా...రెండో అంతస్తు నుంచి చివరి అంతస్తు వరకూ మంటలు వ్యాపించడంతో టవర్ పూర్తిగా అగ్నికీలలతో మూసుకుపోయింది. ఉదయం నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో టవర్ చాలా వరకు దెబ్బతింది. మంటల ధాటికి భవనం కూలిపోయేలా కన్పిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అదే గనుక జరిగితే.. పెను ప్రమాదం తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రతను అదుపు చేయడానికి 200 మంది అగ్నిమాపక సిబ్బంది 40 ఫైర్ ఇంజన్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కొందరిని రక్షించగా...పై ఫ్లోర్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఓవైపు ఎగసిపడుతున్న మంటల కారణంగా సహాయకచర్యలకు సైతం ఆటంకంగా మారింది.
టవర్ లోపలున్న వారైతే...ప్రాణాలు కాపాడుకునేందుకు బెడ్‌షీట్లను తాడులా కట్టుకొని కిందకు దూకేందుకు ప్రయత్నించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొబైల్, టార్చ్‌లైట్ సాయంతో ప్లాష్‌లైట్లు ఆన్‌చేసి తమను కాపాడాలని చేస్తున్న ఆర్తనాదాలు, హాహాకారాలతో టవర్ సమీపంలో భయానక పరిస్థితి నెలకొంది. మంటల ధాటికి అద్దాలు పగిలి పెద్దపెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయని, కొన్ని శిథిలాలు కూలిపోతున్నాయని స్థానికులు తెలిపారు.
పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో.. భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఏ క్షణాన్నైనా భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు. 1947లో ఈ టవర్‌ను నిర్మించగా, ఇటీవలే 10 మిలియన్ పౌండ్లతో మెరుగులు దిద్దారు.
మరిన్ని వార్తలకు...