62 మంది సజీవ దహనం | 62 killed in bus-oil tanker collision in southern Pakistan | Sakshi
Sakshi News home page

62 మంది సజీవ దహనం

Published Mon, Jan 12 2015 2:07 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

62 మంది సజీవ దహనం - Sakshi

62 మంది సజీవ దహనం

కరాచీ: పాకిస్తాన్‌లో ఆదివారం  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి షికార్‌పూర్ వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో మహిళ, చిన్నారి సహా 62 మంది సజీవ దహనమయ్యారు.  గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. సింధ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో బస్సు, ట్యాంకర్‌ను ఢీ కొనగానే మంటలు చెలరేగాయి. బస్సు నుంచి బయటపడటానికి ప్రయాణికులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రయోజనం లేకపోయింది. దీంతో భారీ సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లినట్లు కరాచీ కమిషనర్ షోయబ్ సిద్దిఖీ తెలిపారు.
 
 అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో కరాచీకి చెందిన ఒక కుటుంబంలోని తొమ్మిది మంది మరణించారు. వీరిలో రెండేళ్ల చిన్నారి ఉంది.  ఘటనాస్థలి నుంచి ఇప్పటివరకు వెలికితీసిన 62 మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలన్నీ గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతి వేగంగా వెళ్తున్న బస్సుకు ట్యాంకర్ ఎదురుగా వచ్చేసరికి కంగారు పడిన డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తనిఖీలు చేపట్టడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడం, రహదారులు సరిగ్గా లేకపోవడంతో సింధ్ ప్రావిన్స్‌లో ఇటీవల భారీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement