
క్రిస్మస్ పండగను ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. సాంటాక్లాజ్ తెచ్చే బహుమతుల కోసం చిన్నారులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ వస్తుండటంతో అందరూ పండగ ఏర్పాట్లలో మునిగిపోయారు. తమకు కావాల్సిన వస్తువులు, దుస్తులు కొనుక్కోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చిన్నారి క్రిస్మస్ తాతకు లేఖ రాశాడు. తన కోసం కొన్ని వస్తువులు తీసుకురావాలంటూ సాంటాతాతను కోరాడు. అమెరికాలోని టెక్సాస్‌లో గృహ హింస బాధితుల ఆశ్రమంలో ఓ మహిళ తన ఏడేళ్ల చిన్నారితో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కుమారుడి బ్యాగులోని లేఖను చూసి తల్లి ఆశ్చర్యానికి లోనైంది. విషయం తెలిసిన ఆశ్రమ అధికారి ఒకరు ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ ఉత్తరంలో ‘‘మేము మా ఇంటిని వదిలేయాల్సి వచ్చింది. మా నాన్నకు మతిస్థిమితం లేదు. మేము అన్నీ కోల్పోయాం. అయినా సరే, మేము భయపడాల్సిన అవసరం లేదని, మమ్మల్ని నీవు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తావని అమ్మ చెప్పింది. ఈ క్రిస్మస్‌కు మీరు నా దగ్గరకు వస్తున్నారా..! నా దగ్గర ఏమీ లేవు. అందుకని మీరు నాకోసం కొన్ని పుస్తకాలు, డిక్షనరీ, కంపాస్ తీసుకురాగలరా.. అలాగే నాకు మంచి నాన్న కావాలి. మీరు అది చేయగలరా? ప్రేమతో బ్లాక్’ అంటూ బాలుడు తన ఆవేదనను పేర్కొన్నాడు. లేఖలో కేవలం బాలుడి పేరును మాత్రం మార్చి పోస్ట్ చేశారు. ఈ లేఖ.. చదివిన వారందరి మనసులను కట్టిపడేస్తుంది. కాగా యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి నిమిషానికి సగటున 20 మంది తమ భాగస్వామితో గృహ హింసకు గురవుతున్నారని ఓ జాతీయ నివేదిక పేర్కింది. ఈ లెక్కన ఎంత మంది మహిళలు శారీరక, మానసిక వేదనకు గురవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment