క్షీణ సరస్సుకు ప్రాణ జలం
ఆఫ్రికాలో ఛాద్ పేరుతో ఓ సరస్సు ఉంది. మనుషులు.. అంటే హోమో సేపియన్స్ ఈ విశాలమైన సరస్సు పక్కనే తమ తొలి నివాసాలు ఏర్పరచుకున్నారని చరిత్ర చెబుతోంది. కామరూన్, ఛాద్, నైజీరియా, నిజెర్ దేశాల సరిహద్దుల్లో ఉండే ఈ సరస్సు ఒకప్పుడు 7 లక్షల 70 వేల చదరపు మైళ్లు విస్తరించి ఉండేది. కానీ ఇప్పుడెంత ఉందో తెలుసా? పట్టుమని 1544 చదరపు మైళ్లే. ఇలాగే వదిలేస్తే ఇంకో వందేళ్లలో సరస్సు అన్నదే లేకుండా పోయి... ఆ ప్రాంతం మొత్తం సహార టైపు ఎడారిగా మారిపోతుందట.
ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే... కొంతమంది ఈ సరస్సును మళ్లీ పూర్వస్థితికి తీసుకురావాలని సంకల్పించారు! అందుకు నిదర్శనం ఈ ఫొటోల్లో కనిపిస్తున్న భారీ, అందమైన భవనం. కామరూన్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెర్మాన్ కామ్టే అండ్ అసోసియేట్స్ (హెచ్‌కేఏ) డిజైన్ చేసిన ఈ భవనం ఎన్నో రకాలుగా ప్రత్యేకమైంది. సరే.. ఏం చేస్తారు ఇందులో? ఆఫ్రికా ఖండానికి ఒకవైపున అట్లాంటిక్ మహా సముద్రం ఉంది కదా.. అక్కడి నుంచి ఈ భవనం వరకూ పైపులైన్లు వేస్తారు. ఆ తరువాత సముద్రపు నీటికి మంచినీటిగా మార్చేసి సరస్సులోకి వదిలేస్తారు.
ఇలా కొన్నేళ్లపాటు చేస్తే.. ఆ తరువాత నెమ్మదిగా ఈ సరస్సు మళ్లీ జీవవంతమవుతుందని.. దానిపై ఆధారపడ్డ అనేక జీవజాతులు కూడా పూర్వ స్థితికి చేరుకుంటాయని హెచ్‌కేఏ అంచనా. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేసే నిర్లవణీకరణ ప్రక్రియ మొత్తం ఈ భవనంలోనే జరుగుతుందని, దాంతోపాటే సరస్సు తాలూకూ జీవావరణ వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు, పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకూ ఈ భవనంలోనే ఓ పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని కంపెనీ చెబుతోంది. ఇంకో తొమ్మిదేళ్లలో అట్లాంటిక్ నుంచి భవనానికి పైపు లేయడం పూర్తవుతుంది. 2020 నుంచి సరస్సు సరిహద్దుల్లో మొక్కల పెంపకం చేపడతారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే 2080 నాటికల్లా ఛాద్ సరస్సు తన పూర్వ వైభవాన్ని పొందుతుందని హెచ్‌కేఏ చెబుతోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్