ఘనాలో జంబలకిడిపంబ | abissa celebrations of nzema tribal people, a review of old year | Sakshi
Sakshi News home page

ఘనాలో జంబలకిడిపంబ

Published Wed, Nov 23 2016 6:02 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

ఘనాలో జంబలకిడిపంబ - Sakshi

ఘనాలో జంబలకిడిపంబ

నోట్ల మార్పిడి గొడవ ఒకటొచ్చిందిగానీ, లేదంటే కొత్త సంవత్సర వేడుకల్ని ఎంత కొత్తగా చేసుకోవాలా అని ఇప్పట్నుంచే కొందరు ఆలోచించి ఉండేవాళ్లు. జీమా ప్రజలు చేసుకునే కొత్త సంవత్సర వేడుకలు ఈ విషయంలో మనకు ఏమైనా క్లూ ఇస్తాయేమో! జీమాలు ఆఫ్రికన్లు. వీళ్ల జనాభా సుమారు మూడున్నర లక్షలు. ఇందులో రెండున్నర లక్షల మంది ఘనాలో నివసిస్తున్నారు. మిగిలినవాళ్లు ఐవరీ కోస్ట్‌లో ఉంటారు. ఈ జీమాలనే అప్పోలులు అనీ అంటారు. వీళ్లు మాట్లాడే జీమా భాష వల్లే వీళ్లకు ఆ పేరు వచ్చింది. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి.
 
అబిస్సా ఉత్సవంగా పిలిచే ఈ జీమాల నూతన సంవత్సర వేడుకలు ప్రత్యేకమైనవి. అసలు వీటిని పాత సంవత్సర వేడుకలు అనాలేమో! ఎందుకంటే, గడచిన సంవత్సరాన్ని సమీక్షించుకునే పండగ ఇది. అబిస్సా అంటే ప్రశ్న అని అర్ధం. గతేడాదిలో తమ ప్రవర్తనను బేరీజు వేసుకుని, తమకు తాము ఎంత సత్యంగా ఉన్నామోనని ప్రశ్నించుకోవడం ఈ వేడుకల ప్రధానోద్దేశం. వీళ్ల ఆకన్ క్యాలెండర్‌ ప్రకారం ఈ వేడుకలు ఇప్పుడే మొదలయ్యాయి. సాధారణంగా అక్టోబర్, నవంబరు నెలల్లో రెండు వారాల పాటు ఇవి జరుగుతాయి. ఈ కాలంలో వ్యవసాయ కార్యకలాపాలూ, పెళ్లిళ్ల లాంటి వేడుకలూ అన్నింటినీ నిలిపి జనం ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. డ్రమ్ముల మోత, పాటలు, నృత్యాలతో వీధులు మార్మోగిపోతాయి. ఒక్కోరోజు ఒక్కో రీతిలో జరిగే ఈ వేడుకల్లో జీమాలకు పూర్వీకులుగా చెప్పుకునే ఏడు కుటుంబాలను గౌరవించుకోవడం, రాజు ప్రజలకు దర్శనం ఇవ్వడం, గొప్ప జీమాలకు తగిన గుర్తింపునివ్వడం వంటివి ఉంటాయి. వాళ్ల దేవత న్యామిని దర్శించుకోవడం మరో ప్రధాన ఘట్టం. 
 
ఈ ఉత్సవంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆడవాళ్లు మగవాళ్లుగానూ, మగవాళ్లు ఆడవాళ్లుగానూ దుస్తులు ధరిస్తారు. సంప్రదాయ జీమా కుటుంబాల్లో మాతృస్వామ్యానికే పెద్దపీట. తల్లుల నుంచి ఆస్తి వారికి వారసత్వంగా వస్తుంది. అలాగే, ఒక రోజు ఎదుటివారిని శాపనార్థాలు పెట్టడం, ప్రతీకారం తీర్చుకోవడం ఉంటాయి. ఇందులో భాగంగా ఎదుటివాళ్లు చేసిన తప్పుల్ని ఏకరువు పెట్టి, వారిని దెప్పిపొడుస్తారు.  అయితే, ఆ రోజు ఎవరు ఎవరినైనా క్షమించాలి. చిత్రంగా, కోపం ఉన్నవాళ్లను తిట్టడం, ఆడ మగ వేషధారణ మార్చుకోవడం అనే సంప్రదాయం చిత్తూరు జిల్లాలో జరిగే గంగమ్మ జాతరలో కూడా ఒక భాగం. వారి బావామరదళ్లు పెళ్లి చేసుకునే పద్ధతి కూడా మన తెలుగు నేలను గుర్తుచేస్తుంది. 13 రోజుల పాటు రకరకాల వేడుకల్లో పాల్గొన్న జనం చివరిరోజు ఉదయాన్నే పూజారి దగ్గరకు ఒక కీలకమైన ప్రశ్నతో వెళ్తారు. ఉత్సవం పేరే అబిస్సా కదా! నిజంగా జీమా ప్రజలు కొత్త సంవత్సరంలోకి వెళ్లడానికి అర్హులేనా? అన్నది ఆ ప్రశ్న. ఆయన నుంచి జవాబు సానుకూలంగా రాగానే తమను తాము అభినందించుకుంటూ కేరింతలు కొడతారు. 
-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement