బానిసత్వపు సంకెళ్లు తెంచిన ధీరుడు..
భగవంతుడు సృష్టించిన మనుషులందరిలోనూ ఒకే రంగు గల రక్తం ప్రవహిస్తోంది. అయితే కొందరు పుట్టుకతో భాగ్యవంతులు, మరి కొందరు నిరుపేదలు. మనిషికి మనిషి గౌరవం ఇవ్వాల్సివస్తే ఎవరిని గౌరవించాలి? ధనవంతుడినా లేక పేదవాడినా?? లింకన్‌ని ప్రశ్నిస్తే.. ఎగాదిగా చూస్తాడు. ప్రతి ఒక్కరికీ ఆత్మ గౌరవం ఉంటుందంటాడు. ఇదే విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు అబ్రహాం లింకన్!
1861.. అమెరికా గతిని మార్చేసిన సంవత్సరం. మానవతావాది, నిస్వార్థ ప్రజాస్వామ్య నేత అబ్రహాం లింకన్ ఆ దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఆయనకు ముందు 15మంది, తర్వాత 28 మంది ఆ పీఠం మీద కూర్చున్నారు. అయితే, ఎవరూ ఆయన స్థాయిని చేరుకోలేకపోయారు. ఇప్పటికీ అమెరికా ప్రజల ఆరాధ్య అధ్యక్షుడు లింకనే అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆయన అమెరిన్ల మనసులపై ముద్రవేశారు.
బాల్యం..
1809, ఫిబ్రవరి 12న అమెరికాలోని కెంటకీలో జన్మించాడు లింకన్. తండ్రి వడ్రంగి పనులు చేసేవాడు. చిన్నతనంలోనే విషజ్వరాల కారణంగా తల్లిని పోగొట్టుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగా తరచూ వలసలు వెళ్లే కుటుంబంలో పెరగడంతో పెద్దగా చదువుకోలేదు. తల్లి మరణం తర్వాత తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే సవతి తల్లి లింకన్‌పై ఎంతగానో వాత్సల్యం పెంచుకుంది. సొంతబిడ్డలాగా సాకేది. ఆమె పెంపకంలోనే లింకన్ నీతి, నిజాయతీలను బాగా ఒంటబట్టించుకున్నాడు. ‘మనిషికి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మగౌరవం’ అన్న తన తల్లి మాటలు లింకన్ మనసులో చెరగని ముద్ర వేశాయి.
దుఃఖం..
పుట్టుక నుంచీ పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చిన లింకన్‌ను జీవితకాలం అది వెంటాడుతూనే వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతూ మరణించిన తన పంతొమ్మిదేళ్ల అక్క సారాను తలచుకుంటూ లింకన్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో అతడి మిత్రులకు బాగా తెలుసు. చదువులేనప్పటికీ వ్యాపారంలో రాణిద్దామనుకొన్నాడు. అదీ తీవ్ర నష్టాల్నే మిగిల్చింది. అప్పుల ఊబిలో ఇరుక్కున్నాడు. సవతి తల్లికి సొంత బిడ్డగా మారినా తండ్రికి మాత్రం క్రమేపీ దూరమవుతూ వచ్చాడు.
రాజకీయాలు..
లింకన్ 1832లో ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభకు పోటీచేసి ఓడిపోయాడు. అయితే 1834 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. తర్వాత కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా న్యాయవాద వృత్తిలో గడిపాడు. న్యాయశాస్త్రాన్ని తనంతట తానే అభ్యసించిన లింకన్.. న్యాయవాదిగా ఎంతో ఉన్నతస్థానానికి ఎదిగాడు. అమెరికాలోని తెల్లవారు నల్లవారిని హింసించడం లింకన్‌కు నచ్చలేదు. వారి తరఫున వకాల్తా పుచ్చుకొని ఎన్నో కేసులు వాదించాడు. ఇదే క్రమంలో మరోసారి రాజకీయాల్లోకి రావాలని 1855లో నిర్ణయించుకున్నాడు.
వర్ణవివక్షపై సమరం..
ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మినవాడు లింకన్. అందుకే నలుపు, తెలుపు భేదాలను అంగీకరించలేకపోయాడు. దేశంలో నల్లవారు బానిసత్వంలో మగ్గుతుంటే సుస్థిరత ఎక్కడుంటుందని ప్రశ్నించాడు. అందుకే.. దేశంలో బానిసత్వం, వర్ణవివక్షను రూపుమాపుతానని ప్రకటించాడు. ‘ది డివెడైడ్ స్పీచ్’ పేరుతో ఆయన చేసిన ప్రసంగం అమెరికన్ల భవిష్యత్తునే మార్చివేసింది. మనుషులంతా సమానమని, వర్ణభేదం వద్దంటూ లింకన్ ఇచ్చిన పిలుపు చాలామందిని కదిలించింది. లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యేలా చేసింది.
వ్యతిరేకత..
అధ్యక్షుడైన తర్వాత లింకన్ తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. బానిసత్వాన్ని రూపుమాపాడు. దీంతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 11 రాష్ట్రాలు లింకన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. బానిసత్వం చట్టబద్ధంగా ఉన్న ఈ రాష్ట్రాలు ‘కాన్ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’గా జట్టుకట్టి అంతర్యుద్ధానికి తెరలేపాయి. 1861 నుంచి 1865 వరకూ అంతర్యుద్ధం కొనసాగింది. ఈ తిరుగుబాటును లింకన్ అణచివేయడంతో 1865 ఏప్రిల్ 10న ముగిసింది.
హత్య..
నల్లవారి అభ్యున్నతి కోసం లింకన్ మరింత ముందుకెళ్లాడు. వీరికి ఓటు హక్కు కల్పిస్తానని ప్రకటించాడు. దీంతో కొందరు శ్వేతజాతీయులు లింకన్‌పై కుట్రపన్నారు. అంతమొందించేందుకు ప్రయత్నిం చారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన లింకన్‌ను 1865 ఏప్రిల్ 15న జాన్ విల్కీస్ బూత్ అనే డ్రామా నటుడు తుపాకీతో కాల్చిచంపాడు. అమెరికా అగ్రరాజ్యంగా అవతరించేందుకు పునాదులేసిన లింకన్ మరణంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఆ దేశ చరిత్ర నుంచి ఓ దార్శనికుడు కనుమరుగయ్యాడు.
ఆజానుబాహుడు..
అబ్రహాం లింకన్ ఆజానుబాహుడు. ఆరడుగుల నాలుగంగుళాల పొడవుండే ఆయన అత్యంత బలశాలి కూడా. లింకన్ కండబలం గురించి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. 1834లో ఎన్నికల ప్రచారంలో లింకన్ ప్రసంగిస్తున్నప్పుడు వేదిక ముందున్న మద్దతుదారుల్లోంచి ఒక వ్యక్తి దూసుకొచ్చాడట. తనపై దాడిచేసేందుకే అని గ్రహించిన లింకన్, ఒంటి చేత్తో ఆ వ్యక్తి మెడను అందుకుని అవతల విసిరేశాడట. దీని గురించి నేటికీ కథలు కథలుగా చెప్పుకొంటారు. గొడ్డలిని ఉపయోగించడంలో లింకన్‌ది అందెవేసిన చెయ్యి. ఆయనకు అతీంద్రియ శక్తులుండేవని అమెరికన్లు విశ్వసిస్తారు.