
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో లైంగిక ఆరోపణలు అంశం కలకలం రేపుతోంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి దిగేందుకు సిద్ధవుతున్న అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడిన్‌పై లైంగిక ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన సెనేట్ మాజీ సహాయకురాలు తారా రీడే ఈ ఆరోపణలు చేశారు. జో బైడిన్ తనను అనేక సార్లు లైంగికంగా వేధించారని ఆరోపించడం ఇప్పుడు అగ్రరాజ్యంలో సంచలనం సృష్టిస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి ఆరోపణలు రావడం డెమోక్రటిక్ అభ్యర్థికి కొంతమేర ఇబ్బందికర విషయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. (చైనాపై మళ్లీ కారాలు మిరియాలు)
అయితే తారా చేసిన ఆరోపణలను జో బైడిన్ తీవ్రంగా ఖండించారు. తానెవ్వరనీ లైంగిక వైధింపులకు గురిచేయలేదని, ఇదంతా రాజకీయ కుట్రని అని కొట్టిపారేశారు. కాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఈసారి జో బైడిన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఆయన సమీప అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడా జో కు మద్దతు ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ బరిలో నిలువనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment