
హాలీవుడ్ హీరోకు ఢిల్లీలో చేదు అనుభవం
ఢిల్లీ: హాలీవుడ్ హీరో ఒర్లాండో బ్లూమ్కు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చుక్కలు చూపించారు. సరైన వీసా లేకుండా వచ్చిన ఈ బ్రిటీష్ యాక్టర్ను తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కించారు. దీంతో బ్లూమ్ 24 గంటల వ్యవధిలో లండన్, ఢిల్లీల మధ్య రెండు సార్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికి ఉద్దేశపూర్వకంగానే బ్లూమ్ను ఇబ్బంది పెట్టినట్లు ఇమిగ్రేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బ్లూమ్ కు ఈ చేదు అనుభవం ఎదురవడం గమనార్హం. చివరికి ఈ వ్యవహారంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకొని ఒర్లాండోకు తాత్కాలిక వీసాను మంజూరు చేయాలని ఆదేశించడంతో ఎట్టకేలకు బ్లూమ్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు.