అఫ్గాన్ తాలిబాన్ చీఫ్ హతం
పాక్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మన్సూర్ మృతి
వాషింగ్టన్/కాబూల్: అమెరికా సైనిక దళాలు పాకిస్తాన్‌లో జరిపిన డ్రోన్ దాడుల్లో అఫ్గానిస్తాన్ తాలిబాన్ గ్రూపు అగ్రనేత ముల్లాహ్ అక్తర్ మన్సూర్ హతమయ్యాడు. అఫ్గాన్‌లో శాంతి ప్రక్రియకు పెనుముప్పుగా పరిణమించిన తాలిబాన్ గ్రూపునకు మన్సూర్ మరణం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అఫ్గాన్ సరిహద్దులోని పాకిస్తాన్‌లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో శనివారం అమెరికా ప్రత్యేక దళాలు మానవ రహిత డ్రోన్ల ద్వారా జరిపిన వైమానిక దాడుల్లో మన్సూర్ హతమైనట్టు అమెరికా, అఫ్గాన్ అధికారులు ధ్రువీకరించారు.
అహ్మద్ వాల్‌టౌన్‌కు సమీపంలోని మారుమూల ప్రాంతమైన దాల్బందిలో ఒక వాహనంలో మన్సూర్, మరొక మిలిటెంట్ వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడికి అమెరికా అధ్యక్షుడు ఒబామా అనుమతి ఇచ్చారని ఆ దేశ అధికారులు తెలిపారు. తాలిబాన్ గ్రూపు కొత్త నాయకుడిని ఎన్నుకుని కాబూల్‌కు రావాలని, ఒక రాజకీయ పార్టీ మాదిరిగా వ్యవహరించాలని అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి దౌలత్ వాజిరి హితవు పలికారు. మన్సూర్‌తో అమెరికా బలగాలకు, అఫ్గాన్ ప్రజలకు ముప్పు ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను మన్సూర్ చేపట్టాడు. ఇదిలా ఉండగా తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది.