
ఆఫ్రికన్ల ఆయుష్షు అమాంతం పెరిగింది
ఆఫ్రికా: పేదరికం, ఆహారలేమితో పోషకాహార లోపం, అన్నింటికి మించి మొత్తం ప్రపంచంలోనే ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు ఆఫ్రికా ఖండం సొంతం. సాధరణంగా ఏ దేశాల్లో అమితంగా సౌకర్యాలు ఉంటాయో ఆ దేశాల్లోనే జీవన ప్రమాణ రేటు అమితంగా ఉంటుంది. అయితే, ఇన్ని గడ్డు సమస్యల మధ్య ఉంటున్న ఆఫ్రికా జనాభా జీవిత కాలం మరింత పెరిగింది. గడిచిన పదిహేనేళ్లలో ఆ దేశాల్లో నివసించే ప్రజల ఆయుర్ధాయం ఆశ్చర్యం కలిగించే రీతిలో పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య గణంకాలు-2016 వెల్లడించింది.
2000 సంవత్సరంతో పోల్చినప్పుడు 2015లో అమితంగా వారి ఆయుష్షు పెరిగిందని.. పేద దేశాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆ గణంకాలు వెల్లడించాయి. కనీసం 9.4 సంవత్సరాల అదనపు ఆయుర్ధాయం పెరిగినట్లు పేర్కొన్నాయి. ఎయిడ్స్ మహమ్మారితో పోరాటం విషయంలో కూడా ఆఫ్రికా దేశాలు ముందంజలో ఉన్నట్లు చెప్పాయి.
ఆఫ్రికా ప్రజల జీవిత ఆయుష్షుపై 1990లో వెల్లడైన వాస్తవాలను చూసి అవాక్కయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అందుకు నివారణ మార్గాలు సూచించింది. ఎన్నో కార్యక్రమాలు అమలుపరిచేందుకు సహకరించింది. అంతేకాదు, దాదాపు ఓ ఆరు దేశాలు మలేరియావంటి రోగాల నుంచి పూర్తిస్థాయిలో తాము ఆశించిన సమయం కన్నా ముందుగానే బయటపడతాయని కూడా ఆ సంస్థ తెలిపింది.