సినిమాల్లో తరచుగా చూసే కొన్ని సంఘటనలు నిజ జీవితంలో జరిగితే అద్భుతంగా అనిపిస్తాయి. తెలుగు సినిమాల్లో చూపించినట్లుగానే యాక్సిడెంట్‌లో గతం మరిచిపోవడం.. మళ్లీ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే తిరిగి గుర్తుకురావడం ఇలాంటివి చూసినపుడు మనలో మనమే నవ్వుకోవడం జరిగే ఉంటుంది. కానీ అలాంటి సంఘటన నిజంగా జరిగితే ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోకుండా ఉండలేం.
వివరాల్లోకెళ్తే.. గోర్జో విల్కోపోల్స్కి నగరంలో నివసిస్తున్న జానుస్జ్ గోరాజ్ అనే వ్యక్తికి సుమారు 20 ఏళ్ల కిందట అతడి ఎడమ కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. కుడి కన్ను మాత్రమే స్వల్పంగా కనిపించేది. మసక పట్టినట్లుగా, నీడలు మాత్రమే కనిపించేవి. కొన్ని అలర్జీల వల్ల అతడు చూపు పూర్తిగా మందగించిందని, చికిత్స సాధ్యం కాదని వైద్యులు అప్పట్లో చెప్పేశారు. దీంతో గోరాజ్ అప్పటి నుంచి అంధుడిలాగానే జీవిస్తున్నాడు.
(ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు శవాలు)
అలా గడిచిపోతున్న అతడి జీవితంలో 2018 వెలుగులు నింపింది. జరిగింది ప్రమాదమే అయినా.. అతడి జీవితానికి మాత్రం అదో తీపి ఘటన. ఓ రోజు అతడు రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. అనంతరం గాల్లోకి ఎగిరి కిందపడిన అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తుంటి భాగం విరగడంతో అతడు హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. వైద్యులు సర్జరీ చేసి అతడి తుంటికి చికిత్స అందించారు. సర్జరీ జరిగిన కొన్ని వారాల తర్వాత గోరాజ్ కోలుకున్నాడు. అయితే, ఓ రోజు ఉదయం కళ్లు తెరవగానే.. ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులు స్పష్టంగా కనిపించారు. అది కలో, నిజమో తెలియక అతడు కాసేపు గందరగోళానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు ఇది వైద్య చరిత్రలోనే మిరాకిల్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
(రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..!)
ఈ విషయంపై డాక్టర్లు మాట్లాడుతూ.. 'మేము రోడ్డు ప్రమాదం అనంతరం అతడికి చికిత్సలో భాగంగా కొన్నిరకాల మందులను ఇచ్చాం. వాటిలో ఏ మందు పనిచేసిందో తెలియదుగానీ.. అది అతడి కంటి లోపాన్ని సరిచేసి ఉండవచ్చు. ఆ సమయంలో అతడికి రక్తం గడ్డకుండా ఇచ్చే యాంటికాగ్యులెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా వాటి వల్ల అతడి చూపు మెరుగుపడి ఉండవచ్చు' అని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment