
వాషింగ్టన్ : తరచూ అణుపరీక్షలతో ఇబ్బందిపెడుతున్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా అమెరికా–దక్షిణ కొరియా సోమవారం కొరియా ద్వీపకల్పంలో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించాయి. వందలాది జెట్ విమానాలు ద్వీపకల్పంపై సోమవారం చక్కర్లు కొట్టాయి. తమ సామర్థ్యానికి ప్రత్యర్థికి చూపుతూ యుద్ధానికి రెచ్చగొట్టొద్దని చెప్పడానికి ఈ భారీ డ్రిల్‌ను అమెరికా –దక్షిణ కొరియాలు చేపట్టాయి. అంతేగాక ఈ విన్యాసాలకు ‘ఆపరేషన్ ఉత్తరకొరియా’ అని నామకరణం చేశాయి. గత నెల 29న అత్యంత శక్తిమంతమైన హస్వాంగ్ –15 అణ్వస్త్ర క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగంతో అమెరికాలోని ఏ ప్రాంతంపైన ఉత్తరకొరియా అణుదాడి చేయగల సత్తాను సాధించింది.
నాలుగు రోజులపాటు విన్యాసాలు
అమెరికా సైనిక విన్యాసాల్లో రెండు డజన్ల స్టెల్త్ ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి. అమెరికా లక్షల కోట్ల డాలర్లు పోసి అభివృద్ధి చేసిన ఎఫ్–35 విమానం కూడా డ్రిల్‌లో పాలుపంచుకుంది. మరో నాలుగు రోజుల పాటు ఈ డ్రిల్ కొనసాగనుంది. ఎఫ్–22 రాప్టర్ స్టెల్త్‌లు సహా మొత్తం 230 యుద్ధవిమానాలు విన్యాసాల్లో పాల్గొంటాయి. ఇరు దేశాలకు చెందిన వేల సంఖ్యలో వైమానిక సిబ్బంది కూడా డ్రిల్‌లో పాల్గొంటున్నట్లు దక్షిణకొరియా వైమానిక శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. క్షిపణి ప్రయోగం నేపథ్యంలో అమెరికా, ఉత్తరకొరియా దేశాలు మరోసారి మాటల యుద్ధానికి దిగాయి. ఇలాంటి పరీక్షలు ఆపకపోతే యుద్ధానికి దిగాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. రెచ్చగొడితే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారని ఉత్తరకొరియా కూడా ధీటుగా బదులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment