సిడ్నీ: దాదాపు 32 వేల అడుగు ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానం ఒక్కసారిగా 10 వేల అడుగులు నిట్టనిలువుగా కిందకు దూసుకెళ్లడంతో సిబ్బంది, అందులోని ప్రయాణికులు మృత్యుభయంతో వణికిపోయారు. కిందకు దూసుకెళ్లిన వేగానికి క్యాబిన్‌లో పీడనం తగ్గడంతో సీలింగ్ నుంచి ఆక్సిజన్ మాస్కులు కిందకు పడడం వారి భయాన్ని రెట్టింపు చేసింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కొందరు హాహాకారాలు .. మరికొందరు ప్రార్థనలు మొదలుపెట్టారు. విపత్తు సమయంలో ధైర్యం చెప్పాల్సిన సిబ్బందే చేతులెత్తేయడంతో ప్రయాణికులు ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు.
కొందరు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి కుర్చీల్లో బిగుసుకుపోయారు. చివరి క్షణాలివేనన్న నిర్ధారణకు వచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి 151 మందితో ఇండోనేసియా బయల్దేరిన ఎయిర్ ఏసియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఫైలట్ చాకచక్యంతో విమానాన్ని దగ్గరిలోని పెర్త్ నగరంలో దించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం టేకాఫ్ అయిన 25 నిమిషాల అనంతరం ఈ సంఘటన జరిగింది. దీని పట్ల ఏయిర్ ఏసియా క్షమాపణలు చెప్పింది. ఒక ప్రయాణికురాలు ఆ భయంకర అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ‘చివరి సారిగా నా ఫోన్ నుంచి ఇంటికి మెసేజ్ పంపాను. మేమందరం దాదాపుగా ఒకరికొకరు గుడ్‌బై చెప్పుకున్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment