ప్రయోగాత్మకంగా పైలట్ రహిత ఎయిర్ ట్యాక్సీ పరీక్ష
ఒకవైపు డ్రైవర్లు లేని కార్లు, లారీలు రోడ్లెక్కుతున్నాయా! ఇంకోవైపు డ్రోన్లను చిన్న చిన్న ఎగిరే కార్లుగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందా! ఈ మధ్యలో... అసలు ఎగిరే కార్లకు డ్రైవర్లు ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది ఇజ్రాయెల్‌కు చెందిన టాక్టికల్ రోబోటిక్స్ సంస్థ. ఓ కాల్ చేస్తే ఇంటిపైకి ఎగిరే కారు వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కేసి? ఎక్కడికెళ్లాలో చెబితే చాలు. నిమిషాల్లో మీరు గమ్యం చేరిపోవచ్చు అంటోంది ఈ కంపెనీ. వట్టి మాటలతోనే సరిపెట్టలేదు ఈ టాక్టికల్ రోబోటిక్స్ సంస్థ. ఫొటోలో కనిపిస్తోందే... ఎయిర్‌మ్యూల్ ఎయిర్ ట్యాక్సీ... దాన్ని ఈ మధ్యే విజయవంతంగా నడిపి చూసింది కూడా.
రెండు లేజర్ ఆల్టీమీటర్లు (ఎత్తును కొలిచేందుకు వాడే యంత్రాలు), ఇంకో రాడార్ ఆల్టీమీటర్, కదలికల్ని గుర్తించే ఇనర్షియల్ సెన్సర్లతోపాటు నిట్టనిలువుగా గాలిలోకి ఎగిరేందుకు అవసరమైన మోటార్లు, రోటర్ బ్లేడ్లున్నారుు దీంట్లో. దీంతోపాటు ఒక పైలట్‌లా ఎప్పటికప్పుడు ఏ దిక్కుకు, ఎంత వేగంతో, ఎలాంటి కోణంలో ప్రయాణించాలి లాంటి నిర్ణయాలన్నీ తీసుకునేందుకు దీంట్లో ప్రత్యేక ఫ్లైట్‌మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ‘ఇంకేముంది! ఎలాగూ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు కదా! త్వరలోనే వీటిని మనమూ చూడవచ్చా?’ అంటే... కొంచెం ఓపిక పట్టాలి అంటోంది సంస్థ. తొలి ప్రయత్నం విజయవంతమైనప్పటికీ అందులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట.
అత్యవసర సందర్భాల్లో ఈ పైలట్ లెస్ ఎయిర్ ట్యాక్సీ ఉపయోగం చెప్పే నమూనా చిత్రం
ఫ్లైట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ మూడు సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకోలేదని ఆ సంస్థ అంటోంది. రెండుసార్లు లేజర్ ఆల్టీమీటర్ రీడింగ్‌స తప్పుగా వచ్చాయట. ఫలితంగా ప్రయాణాన్ని కొంచెం ముందుగానే నిలిపివేయాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించిన తరువాత మరిన్ని పరీక్షలు నిర్వహించి, వీటిని విస్తృత వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటోంది టాక్టికల్ రోబోటిక్స్. అన్నట్లు... తాజాగా ఇంకో విషయం... కంపెనీ తన వాహనం పేరును ఇప్పుడు ఎయిర్‌మ్యూల్ నుంచి కొమరాంట్ అని మార్చేసింది!