
సముద్రంలో 'ఎయిర్ ఏషియా' భారీ శకలాలు
జకార్తా: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియాకు చెందిన రెండు భారీ శకలాలను గత అర్థరాత్రి గుర్తించినట్లు ఇండోనేసియా ఉన్నతాధికారి శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సముద్రంలో దాదాపు 90 మీటర్ల అడుగు భాగంలో వీటిని గుర్తించినట్లు తెలిపారు. వాటిని వెలికి తీసేందుకు ఈ రోజు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
గత ఆదివారం 162 మంది ప్రయాణికులతో ఇండోనేసియాలోని రెండో అతిపెద్ద నగరం సురబయ్య నుంచి సింగపూర్ బయలుదేరిన విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 162 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 155 మంది ప్రయాణికులు కాగా, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 30 మృతదేహలను సముద్రం నుంచి వెలికితీశారు.