లండన్: హొర్ముజ్ జలసంధి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెళ్లే పౌర/వాణిజ్య విమానాలు కూడా పొరపాటున కూల్చివేతకు గురయ్యే అవకాశాలు ఉంటాయంటూ అమెరికా హెచ్చరించడంతో పలు విమానయాన సంస్థలు తమ విమానాల ప్రయాణ మార్గాలను మార్చుకున్నాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఖంతాస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, మలేసియా ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, కేఎల్‌ఎం సహా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయం ఫలితంగా న్యూయార్క్–ముంబై విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్టు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఆ మార్గంలో విమానం నడిపి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించలేమని తెలిపింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన నేపథ్యంలో పౌర విమానాల దారి మళ్లించినట్టు తెలుస్తోంది. ఇరాన్‌లోని ఎంపిక చేసిన మూడు లక్ష్యాలపై గురువారం రాత్రే దాడి చేయాలని అంతా సిద్ధం చేసినప్పటికీ, దాడి చేస్తే 150 మంది చనిపోతారని తెలియడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో శుక్రవారం ప్రకటించారు. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. (చదవండి: ఆఖరి క్షణంలో ఆగిన యుద్ధం)
Comments
Please login to add a commentAdd a comment