
బీజింగ్ : రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ వారానికి ఆరు రోజులు పనిచేయాలని ‘996’ ఫార్ములాను ప్రతిపాదించిన అలీబాబా వ్యవస్ధాపకుడు, చైనా సంపన్నుడు జాక్ మా తాజాగా మరో సలహాతో ముందుకొచ్చారు. వారానికి ఆరు రోజులు, ఆరుసార్లు శృంగారంలో పాల్గొనాలని ఉద్యోగులకు సూచించారు.
అలీబాబా గ్రూప్ ఉద్యోగుల సామూహిక వివాహ వేడుక సందర్భంగా చైనాలోనే అత్యంత సంపన్నుడైన జాక్ మా ఈ ప్రతిపాదన చేసినట్టు డైలీ మెయిల్ వెల్లడించింది. పనిలో మనం ‘996’ను జీవితంలో ‘669’ను మనం ఫాలో కావాలని ఆయన చెప్పారు. కంపెనీ ప్రధాన కార్యాలయం హంగ్‌జూలో ఏటా మే 10న జరిగే సామూహిక వివాహాల సందర్భంగా 54 ఏళ్ల మా ఈ వ్యాఖ్యలు చేశారని డైలీ మెయిల్ పేర్కొంది.
కాగా 996 పని ప్రతిపాదనను టెక్నాలజీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, తాజాగా ఆయన ప్రతిపాదించిన 669ను కూడా నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆఫీసులో 996 స్ఫూర్తితో పనిచేసిన తర్వాత ఇక ఇంట్లో 669 అమలు చేసేందుకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందని పలువురు నెటిజన్లు నిట్టూర్చారు. కాగా ‘669’ కోట్‌ను వైబోలో అలీబాబా అధికారిక పేజ్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment