పోటీపడి జీతాలు పెంచుతున్న అమెరికా కంపెనీలు
వాషింఘ్టన్: అమెరికాలోని అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా బహుళజాతి సంస్థలు ఇటీవలి కాలంలో తమ ఉద్యోగుల జీత భత్యాలను భారీగా పెంచుతున్నాయి. మునుపెన్నడూ లేని ప్రేమను కురిపిస్తున్నాయి. వారిని ప్రశంసా పత్రాలతో ముంచెత్తుతున్నాయి.
అమెరికాలోనే ఎక్కువ మంది ఉద్యోగులు కలిగిన ‘వాల్‌మార్ట్’ కార్పొరేట్ సంస్థ గత ఫిబ్రవరి నెలలోనే తమ ఉద్యోగుల జీత భత్యాలను భారీగా పెంచింది. తమ ఉద్యోగులను ‘అసోసియేట్స్’గా సంబోధిస్తూ ప్రశంసపూర్వక వ్యాఖ్యలు కూడా చేసింది. ‘మీరు పడ్డ కష్టానికి ఇది ప్రతిఫలం. పని నేర్చుకోవడానికి, ఎదగడానికి, వాల్‌మార్ట్ కన్నా మీ కరీర్‌ను గొప్పగా అభివృద్ధి చేసుకోవడాని ఇంతకన్నా మంచి ప్లేస్ మరొకటి ఉండదు’ అంటూ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డౌగ్ మ్యాక్ మిలన్ లేఖ రాశారు. ఎల్లప్పుడు ఈ సంస్థ తమ ఉద్యోగులను ‘అసోసియేట్స్’ అనే సంబోధిస్తుంది.
ఇక స్టార్‌బక్స్ కంపెనీ కూడా దాదాపు లక్ష మంది కార్మికులకు ఇటీవల జీతభత్యాలను పెంచింది. ఈ కంపెనీ తమ ఉద్యోగులను ‘పార్ట్‌నర్స్’ అని సంబోధిస్తుంది. ‘తోటి మానవులతో సంబంధాలు పెట్టుకున్నప్పుడే విశ్వాసం వికసిస్తుంది’ కంపెనీ చైర్మన్, సీఈవో హొవార్డ్ శుల్జ్ తమ పార్ట్‌నర్స్‌కు లేఖ రాశారు. ఇటీవల అమెరికాలో జరిగిన కాల్పుల సంఘటనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జేపీ మోర్గాన్ బ్యాంక్ కూడా తక్కువ వేతనాలు అందుకుంటున్న దిగువస్థాయి ఉద్యోగులకు (బ్యాంక్ టెల్లర్ స్థాయి ఉద్యోగులు) ఇటీవల 18 శాతం వేతనాలను పెంచింది. ‘స్తంభించిన వేతనాలు, వేతనాల్లో కొనసాగుతున్న వ్యత్యాసాలు, సరైన విద్యార్హతలు లేకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం, నైపుణ్యాభివృద్ధి లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో మీ పక్షాన నిలబడడం మా పౌర విధి’ అని బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జమీ డైమన్ లేఖ రాశారు. జేపీ మోర్గాన్ బ్యాంక్ మాత్రం తమ సిబ్బందిని ‘ఎంప్లాయీస్’ అనే సంబోధిస్తోంది.
మెక్ డొనాల్డ్, టార్గెట్, టీజే మాక్స్ సంస్థలు కూడా తమ ఉద్యోగుల జీత భత్యాలను పెంచింది. ఎందుకిలా ఈ కంపెనీలు పోటీపడి జీత భత్యాలను పెంచుతున్నాయి? దీనికి దోహదపడుతున్న పరిణామాలు ఏమిటీ? కార్మికుల కొరత మొదటి కారణం. ఉద్యోగాల కొరత ఉన్నప్పుడు కార్మికులపైన యాజమాన్యం పైచేయి కొనసాగుతుంది. ప్రస్తుతం కార్మికుల కొరత ఉండడంతో కార్మికులకు డిమాండ్ పెరిగింది. కంపెనీ వీడి కార్మికులు బయటకు పోకుండా రక్షించుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే బెనిఫిట్లు చూపిస్తున్నారు. అమెరికాలో 2015, డిసెంబర్‌లో స్వచ్ఛందంగా ఉద్యోగం మానేసిన వారి సంఖ్య గత పదేళ్లకాలంలోనే ఎక్కువట.
అమెరికాలో బహుళజాతి కంపెనీల పట్ల వ్యతిరేక భావం ప్రజల్లో పెరుగుతుండడం రెండో కారణం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పలుదేశాల్లో పవనాలు వీస్తున్న విషయం తెల్సిందే. మూడో కారణం దేశ రాజకీయాలు. వలసలను నియంత్రిస్తామని, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే నినాదాలు దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారి నోట వినిపిస్తున్న విషయం తెల్సిందే. తమ బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా దేశ ప్రభుత్వం ఎలాంటి చట్టాలు చేయకుండా ఉండడం కోసం ఉద్యోగులను మంచి చేసుకోవాలని, తద్వారా ప్రజల్లో సద్భావం కలిగేలా చూడాలన్నది కంపెనీల తాపత్రయం.