భారత ఐటీ కంపెనీలకు అమెరికా షాక్!
- ప్రతినిధుల సభలో వీసా సంస్కరణ చట్టం బిల్లు
- ఆమోదం పొందితే హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు కోత
వాషింగ్టన్ : భారత ఐటీ కంపెనీలకు అమెరికా షాక్ ఇవ్వబోతోంది. భారత ఐటీ కంపెనీల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిరోధించడానికి ఉద్దేశించిన హెచ్-1బీ, ఎల్-1 వీసా సంస్కరణ చట్టం బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. డెమొక్రాటిక్ సభ్యుడు బిల్ పాస్క్రెల్, రిపబ్లికన్ డానా రోహ్రా బాచర్ దీన్ని ప్రతిపాదించారు. ఇది ఆమోదం పొందితే హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు భారీగా కోత పడనుంది. బిల్లు ప్రకారం.. ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 మంది కంటే ఎక్కువగాని, మొత్తం ఉద్యోగుల్లో 50 శాతంకంటే ఎక్కువగా కానీ ెహ చ్-1బీ,ఎల్-1 వీసా ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించకూడదు.
అమెరికాలోని పలు కంపెనీల్లో విదేశీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువని, తద్వారా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ అమెరికన్‌లను దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌కు చెందిన పెద్ద ఐటీ కంపెనీలన్నీ హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ బిల్లు హెచ్-1బీ, ఎల్-1 వీసాల జారీలో అవినీతిని తొలగించడానికి, అమెరికన్ ఉద్యోగులకు, వీసాదారులకు రక్షణ కల్పించడానికేనని కాంగ్రెస్ సభ్యులు వాదిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘింస్తే భారీ జరిమానాలు వేయడానికి ఉద్దేశించినదని చెబుతున్నారు. బిల్లుకు అమెరికా అధ్యక్షుడి ఆమోద ముద్ర పడాలంటే అంతకు ముందు సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంది. అయితే గతంలో 2010లో పాస్క్రెల్, రోహ్రా బాచర్ ఇదే తరహా బిల్లును ప్రవేశపెట్టినా అది కాంగ్రెస్ ఆమోదం పొందలేదు.