
మెక్సికో : అత్యంత పురాతన గుహలో లభించిన 9000 ఏళ్ల నాటి మానవ అవశేషాలు, మంచుయుగంలో సంచరించిన జంతువుల ఎముకలను ఆర్కియాలజిస్టులు పరిశీలిస్తున్నారు. తూర్పు మెక్సికోలో ఇటీవల కొందరు డైవర్స్ నీట మునిగిన ఓ భారీ గుహను గుర్తించడంతో పురాతన మాయా నాగరికత గురించి ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయని భావిస్తున్నారు. మానవ అవశేషాలతో పాటు పురాతన ఏనుగులు, ఎలుగుబంట్ల ఎముకలు బయటపడ్డాయని మెక్సికో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గుహల వెలికితీత అక్కడి పురావస్తు శాఖలో సంచలనం సృష్టించింది.
‘ఇది నిజంగా అద్భుతం..ప్రపంచంలోనే ఇది అత్యంత కీలకమైన నీటిలోపలి పురావస్తు ప్రదేశ’మని మెక్సికో నేషనల్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ ఇనిస్టిట్యూట్ (ఐఎన్‌ఏహెచ్) రీసెర్చర్ గిల్‌రెమో డి అండా అన్నారు. ఐఎన్‌ఏహెచ్ విశ్లేషణల ప్రకారం మంచుయుగం చివరినాళ్లలో నీటి ప్రవాహం 100 మీటర్ల మేర ఎగసి గుహను ముంచెత్తిందని దీంతో అక్కడి జీవావరణం నాటి అవశేషాలు కొంతమేర పదిలపరచబడ్డాయని వెల్లడైంది. చివరి మంచుయుగం 26 లక్షల సంవత్సరాల కిందట ఆరంభమై 11,700 ఏళ్ల కిందట ముగిసిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment