ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : అమెరికా ప్రభుత‍్వం హెచ్1 బి వీసాలపై రూపొందిస్తున‍్న కఠిన నిబంధనలు ఒకవైపు భారతీయ ఐటీనిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుండగా.. తాజాగా హెచ్1బీ వీసాలకు వ్యతిరేకంగా అమెరికాలో వినూత్న నిరసన మొదలైంది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో హెచ్1 బీ వీసాల జారీకి వ్యతిరేకంగా రైల్వేస్టేషన‍్లలోనూ రైళ్లపై పోస్టర్స్‌ను అతికించారు. అయితే ఇది హెచ్1 బీ వీసాలకు వ్యతిరేకంగా కాదనీ, వీటిపై అవగాహన కల్పించేందుకే కల్పించేందుకే చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. మార్చి 15న మొదలైన ఈ ఉద్యమం ఏప్రిల్ 1 వరకు కొనసాగుతుందని చెప్పారు.
హెచ్1 బీ వీసాల జారీలో భారతీయ ఐటీ నిపుణుల నియామకాలపై ప్రాధాన్యతకాకుండా కేవలం అమెరికా ఉద్యోగులకు బదులుగా మాత్రమే ఇక్కడి ఐటీ ఉద్యోగాలు కేటాయిస్తున్నారంటూ ఆందోళన కారుడు, వాషింగ‍్టన్ డీసీకిచెందిన ప్రొగ్రెసివ్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ రిఫర్మ్ డైరెక్టర్ కెవిన్ లిన్ పేర్కొన్నారు. నిబంధనలను కఠినతరం చేసిన తరుణంలో దీనిపై వ్యతిరేకత రేగుతున్న నేపథ్యంలో వీటిపై అందరికీ అవగాహన కల్పించాలనీ ఈ విధంగా నిరసన చేపట్టామన్నారు. ఇక్కడి స్థానికులు అవకాశాలు కోల్పోతున్నారనీ, వలసవచ్చిన వారినే ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారని వాదించారు. ఇక్కడి యువతకు ప్రతిభ ఉన్నా వేరే దేశం నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తున్నారని ఆయన అన్నారు. మేం చేస్తున్న ఈ నిరసనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే తమ ఉద్యమానికి కొంతవ్యతిరేకత ఉన్నప్పటికీ భారీ మద్దతు లభిస్తోందన్నారు. ఈ నిరసన మిగతా రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. కానీ ఈ పద్దతిలో కాదనీ, ఆయా రాష్ట్రాల పరిస్థితి అనుగుణంగా నిరసనలు చేపడతామని అన్నారు.
హెచ్1 బీ వీసాదారులకు ఇక్కడి కంపెనీలు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు. ఒకవేళ కంపెనీ వారిని తీసేయాలనుకుంటే కారణం లేకుండానే తీసివేయగలదు. అప్పుడు వారు తిరిగి వారి దేశానికి వెళ్లాల్సిందేనని లిన్ అన్నారు. అలాంటి సమయాంలో ఆ ఉద్యోగాల్లో ఇక్కడ ప్రతిభ ఉన్న యువతను నియమించుకోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం కంపెనీలు మొదటగా ఇక్కడి స్థానికులకే ప్రాధాన్యతనివ్వాలి. సాధారణ కిందిస్థాయి ఉద్యోగాలకు కూడా హెచ్1 బీ వీసాదారులను నియమించుకోకూడదు. ఒకప్పుడు వీటిని జీనియస్ వీసాగా పిలిచేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. అమెరికాకు వస్తున్న మేధావి వర్గం గురించి మేం వ్యతిరేకంగా పోరాడటం లేదు. ఇక్కడి కార్మికుల పొట్ట కొట్టేవారిపైనే వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు.
ఇక్కడికి వచ్చిన వలసదారులు అమెరికా అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని, ఆర్థికాభివృద్ధికి ఎంతో సహకరించారని ఇప్పుడు ఇలాంటి నిరసనల వల్ల వలసదారులపై వ్యతిరేక భావాలకు ఆజ్యం పోసినట్లు ఉంటుందని హిందు అమెరికన్ ఫౌండర్ కల్రా పేర్కొన్నారు. మరోవైపు తాముఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం లేదని బే ఏరియా ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ (బార్ట్ ) స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment