ముజఫరాబాద్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్) : పాకిస్తాన్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బల్టిస్తాన్, ముజఫరాబాద్, రావల్‌కోట్, కోట్లీ తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఆదివారం బ్లాక్ డే పాటించారు. పలు ప్రాంతాల్లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. తమకు స్వతంత్రం కావాలని.. స్వేచ్ఛగా బతకాలని అభిలషిస్తున్నట్లు ప్రజలు స్పష్టం చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం దేశ విభజన చేసి.. స్వతంత్రం ఇచ్చాక జమ్మూ కశ్మీర్ రాజ్యం అప్పటి రాజు స్వతంత్ర ఏలుబడిలో ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ సరిగ్గా 70 ఏళ్ల కిందట ఇదే రోజు (1947 అక్టోబర్22)న పాకిస్తాన్ కశ్మీర్‌లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్ 22న బ్లాక్ డే నిర్వహిస్తున్నారు.
రావల్‌కోట్‌లో పెద్ద ఎత్తున ప్రజలు బ్లాక్ డేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తక్షణం ఆక్రమిత కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా కోట్లీ, హాజీరా ప్రాంతాల్లోనూ ప్రజలు నిరసనలు నిర్వహించారు. ముజుఫరాబాద్‌లోని నీలం బ్రిడ్జి దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు.. పాక్ సైన్యం తమపై చేస్తున్న అకృత్యాలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కోరారు.
ఆ ఘటన మర్చిపోలేం
ఆక్రమిత కశ్మీర్‌కు స్వతంత్రం కావాలని పోరాటం చేస్తున్న జమ్మూ కశ్మీర్ నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(జేకేఎన్‌ఎస్‌ఎఫ్) నాయకుడు నాబీల్ ముఘల్ మాట్లాడుతూ.. 70 ఏళ్ల కిందట రాత్రి నిద్రిస్తున్న గిరిజనులపై పాక్ సైన్యం చేసిన అకృత్యాలను ఎన్నటికీ మర్చిపోలేమని చెప్పారు. చైనా సహకారంతో నిర్మిస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌ను తక్షణమే నిలపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పాక్ సైన్యం, ప్రభుత్వం మమ్మల్ని లూఠీ చేస్తోందని జమ్మూ కశ్మీర్ నేషనల్ ఇండిపెండెన్స్ అలయెన్స్ ఛైర్మన్ సర్దార్ మహమూద్ కశ్మీరీ స్పష్టం చేశారు. ఆజాద్ కశ్మీర్‌కు ప్రధాని, అధ్యక్షుడు ఉన్నా.. పాలన మాత్రం ఇస్లామాబాద్ నుంచే సాగుతోందని.. దీనిని వ్యతిరేకిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment