
కార్మిక సమ్మెతో స్తంభించిన గ్రీస్
ఏథెన్స్: కార్మిక సంఘాల సమ్మెతో గ్రీస్ గురువారం స్తంభించింది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో లేఆఫ్‌లు, పింఛన్ సంస్కరణలు, పన్నుల హెచ్చింపునకు నిరసనగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కార్మిక సంఘాలు 24 గంటల సమ్మెకు దిగడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. వందలాది విమానాలు రద్దయ్యాయి. నౌకలు రేవుల్లోనే నిలిచిపోయాయి. ఆసుపత్రులు అత్యవసర సిబ్బందితోనే నడిచాయి. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లోనూ ప్రజారవాణా నిలిచిపోయింది. ప్రైవేటు రంగంలోని గ్రీస్ కార్మికుల సమాఖ్య , ప్రభుత్వ రంగంలోని గ్రీస్ ప్రభుత్వరంగ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఏకకాలంలో సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
పలురకాల పొదుపు చర్యలు పొందుపరచిన 2015వ సంవత్సరపు బడ్జెట్‌పై వచ్చే నెలలో పార్లమెంటులో చర్చ జరగనున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఆర్థికమాంద్యంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్‌ను ఇప్పటికే రెండుసార్లు ఆదుకున్న యూరోపియన్ యూనియన్(ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) డిమాండ్లమేరకు గ్రీస్ ప్రభుత్వం లేఆఫ్‌లు, పింఛన్ సంస్కరణలు అమలుచేస్తోంది. ఈ విషయంలో గ్రీస్ ప్రభుత్వ వైఖరిపై, అంతర్జాతీయ సంస్థల వైఖరిపై కార్మిక సంఘాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి.