నిప్పులు కక్కిన నెలబాలుడు
సమైక్యాంధ్ర ఉద్యమం ప్రతి గడపనూ తాకింది. సమైక్య నినాదాలతో జిల్లా మార్మోగుతోంది. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించి సరిగ్గా నెల రోజులయింది. అప్పట్నుంచి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. బంద్‌లు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరాహార దీక్షలు, రహదారుల దిగ్బంధాలతో అట్టుడికిపోతోంది.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కట్లేదు. ప్రభుత్వోద్యోగులు విధులకు హాజరుకావడం లేదు. విద్యా సంస్థలు సక్రమంగా పని చేయడం లేదు. వ్యాపార సంస్థలు వెలవెలబోతున్నాయి. నెల రోజులుగా ఇదే పరిస్థితి. సమైక్యాంధ్ర ఉద్యమం ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. నెల రోజులుగా సమైక్య ఉద్యమం మహోగ్రరూపం దాలుస్తూ పల్లె పల్లెకు విస్తరించింది.
ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీఓల సమ్మెతో ఉద్యమం ఉధృతమైంది. రోజుకో ఉద్యోగ సంఘం విధులను బహిష్కరించి రోడ్ల మీదకు వచ్చి సమైక్యాంధ్ర కోసం చేస్తున్న నినాదాలతో జిల్లా మార్మోగిపోతోంది. ప్రస్తు తం జిల్లాలో ఇన్చార్జి కలెక్టర్ మినహా మిగిలిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. దీంతో జిలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. పాల న పూర్తిగా స్తంభించిపోయింది. తెలంగాణకు చెందిన ఒక డిప్యూటీ కలెక్టర్‌తో పాటు మరో ఇద్దరు తహశీల్దార్లు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటుండడం గమనార్హం.
రోజుకో కార్యాచరణ : ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి రోజుకో కార్యాచరణతో ఉద్యోగ సంఘాలు ముందుకు సాగుతున్నాయి. కలెక్టరేట్ ఎదుట ఎపీఎన్జీలు రిలే నిరాహార దీక్షలకు అన్ని వర్గాలు సంఘీభావం వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీవీఎంసీ, సర్వే, వీఆర్వో ఇలా అన్ని ఉద్యోగ సంఘాలు ఈ దీక్షల్లో పాల్గొంటున్నాయి. జిల్లా అంతటా విభిన్న కార్యక్రమాలు, నిరసనలతో ఉద్యమానికి తారస్థాయికి తీసుకువెళుతున్నాయి. ఈ నెల 24 నుంచి జిల్లా అధికారులు కూడా సామూహిక సెలవులు పెట్టారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉన్న 72 శాఖల ఉన్నతాధికారులు సైతం సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు.
తాజాగా ఈ నెల 31న జీవీఎంసీ ఎదురుగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. సుమారుగా 60 వేల మంది ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రజలు పాల్గొంటారని చెబుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మాత్రమే సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాట పట్టగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా వీరికి సంఘీభావం తెలియజేయాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల్లో కార్యకలాపాలను స్తంభించడం ద్వారా యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు ఆలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 31న జరిగే బహిరంగ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొననున్నాయి.
30, 31 తేదీల్లో రవాణా వ్యవస్థ బంద్ : ఆర్టీసీ యూనియన్లు సమ్మె బాట పట్టడంతో గత నెల రోజులు నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. యూనియన్లపై ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా, ఎస్మా, ఇతరత్రా జీవోలు విడుదల చేసినా కార్మికులు వెరవలేదు. గత 30 రోజుల నుంచి బస్సులను తిప్పకుండా యూనియన్ నాయకులు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వాహనాలైన ఆటోలు, ట్యాక్సీలు, ఇతర వాటిపై ఆధారపడుతున్నారు. తాజాగా జిల్లాలో ఈ నెల 30, 31 తేదీలలో ఆటోలు యూనియన్లు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నాయి. దీంతో ఈ రెండు రోజులు ఆటోలు బంద్ కానున్నాయి. అలాగే 31న ట్యాక్సీలు కూడా నిలిచిపోనున్నాయి. దీంతో ఈ రెండు ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.
నేడు దుకాణాలు బంద్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శుక్రవారం దుకాణాలు బంద్ నిర్వహిస్తున్నట్లు ది వైజాగ్‌పటం చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అధ్యక్షుడు కంచర్ల రామబ్రహ్మం ప్రకటించారు. సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సమైక్యాంధ్ర పరిరక్షణ వర్తక, వాణిజ్య సంయుక్త కార్యాచరణ కమిటీని రూపొందించినట్టు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రిని 13 జిల్లాల జేఏసీ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు.
ఆదాయానికి గండి : నెల రోజులుగా జరుగుతున్న ఉద్యమాలు కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలో 1066 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో ఇప్పటి వరకు సంస్థకు రూ.12 కోట్లు మేర నష్టం వచ్చింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రోజుకు రూ.1.5 కోట్లు వరకు ఆ దాయం వస్తుంటుంది. ఈ శాఖ ఉద్యోగులు కూడా విధులను బహిష్కరించడంతో సుమారుగా రూ.25.5 కోట్లు వరకు ఆదా యం రాకుండాపోయింది. ఖజానాశాఖలో రోజుకు రూ.5 కోట్లు వరకు జమలు జరుగుతుంటాయి. వీరు కూడా ఆందోళన బాట పట్టడంతో ఇప్పటి వరకు రూ.375 కోట్లు వరకు ఖజానాకు చేరలేదు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ సమైక్యాంధ్ర కోసం ప్రజలుకూడా ఉద్యోగ సంఘాలకు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.