భూకంపాలు సంభవించడం మనకు ఇంతవరకు తెలుసు. కానీ కృత్రిమ భూకంపాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఉత్తరకొరియాలో ఇది సంభవించింది. అక్కడ అణుపరీక్షలు నిర్వహించిన స్థలం వద్ద కృత్రిమ భూకంపం వచ్చినట్లు పలు దేశాలకు చెందిన వాతావరణ కేంద్రాలు, భూకంప కేంద్రాలు తెలిపాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది.
ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. అక్కడ 2013లో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అదే స్థలంలో కృత్రిమ భూకంపం వచ్చినట్లు గుర్తించారు. సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తరకొరియాలో సంభవించినది భారీ పేలుడు కావచ్చని చైనా భూకంప గుర్తింపు కేంద్రాలు అనుమానిస్తున్నాయి. అది కృత్రిమ భూకంపం అని దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది.
అయితే, ఉత్తర కొరియా మళ్లీ తాజాగా ఏమైనా అణు పరీక్షలు నిర్వహించిందా.. వాటివల్లే ఇలా కృత్రిమ భూకంపం ఏమైనా సంభవించిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పరిస్థితి గురించి ఉత్తరకొరియా బుధవారమే ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.