
ఐసిస్ కు ఆర్థిక కష్టాలు
వాషింగ్టన్ : తన అధీనంలోని భూభాగం తరిగిపోతోంటే ఉగ్రసంస్థ ఐసిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆల్‌ఖైదా మాదిరిగా బలవంతపు వసూళ్లు, అపహరణలు, విరాళాల సేకరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్, సిరియాల్లోని సహజ వనరులు, తమ ఏలుబడిలో ఉన్న పట్టణాల్లో పన్ను విధించడమే సంస్థకు ఆదాయ వనరులు. కొంతకాలంగా మోసుల్ పట్టణాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇరాకీ సేనలు యుద్ధం మొదలుపెట్టడంతో ఐసిస్ కథ అడ్డం తిరిగింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. అక్కడి చమురు, నగదు నిల్వల ద్వారా సమకూరే బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని క్రమంగా కోల్పోతోంది.
2015లో ఇరాక్‌లో పన్నులు, బలవంతపు వసూళ్ల వల్ల ఐసిస్ నెలకు 30 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఒక్క మొసూల్ పట్టణంలోనే పన్నుల ద్వారా నెలకు సుమారు 4 మిలియన్ల ఆదాయం సమకూరుతోంది. బ్యాంకు దొంగతనాలు సంస్థకు మూడో అతిపెద్ద ఆర్థిక వనరులుగా ఉన్నాయి. మొసూల్‌ను ఆక్రమించిన కొత్తలో అక్కడి ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 500 మిలియన్ డాలర్లను ఐసిస్ ఒకేసారి దొంగిలించింది. ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఐసిస్ పోరాటదారుల వేతనాలు సగానికి తగ్గాయి.