జర్మన్ చాన్స్‌లర్ హత్యకు కుట్ర
జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆమె వాహనశ్రేణిలోకి చొరబడేందుకు ప్రయత్నించిన సాయుధుడిని చెక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికార ప్రతినిధి జోసెఫ్ బోకన్ తెలిపారు. ఆ నిందితుడు నేరం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసిందని అన్నారు. ఈ కేసును ప్రేగ్ డిటెక్టివ్‌లు విచారిస్తున్నట్లు చెప్పారు. చెక్ ప్రధానమంత్రి బొహుస్లవ్ సొబొట్కాను కలిసేందుకు జర్మన్ చాన్స్‌లర్ మెర్కెల్ వచ్చారు. ఆమె విమానాశ్రయం నుంచి నగరానికి వెళ్తుండగా నిందితుడి నల్ల మెర్సిడెస్ కారు ఆమె వాహనశ్రేణిలోకి ప్రవేశించింది.
మెర్కెల్ వాహనాన్ని అనుసరిస్తున్న పోలీసుకార్లు చేసిన హెచ్చరికలను ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. పైగా తనను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసు కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. కాల్చిపారేస్తామని పోలీసులు హెచ్చరించి తుపాకులు బయటకు తీసిన తర్వాత మాత్రమే అతడు ఆగాడు. గడిచిన ఏడాది కాలంగా వరుసగా యూరోపియన్ దేశాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ కుట్రను కూడా పోలీసులు సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడుల్లో వందలాది మంది మరణించారు.