రెయిన్బోను చీలుస్తూ విమానం ల్యాండింగ్
డసెల్ డార్ఫ్: జర్మనీలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధరణ పరిస్థితులు ఉన్నప్పుడు సురక్షితంగా విమానంలో నుంచి ప్రాణాలతో దిగడమే అద్భుతం అనుకుంటున్న ఈ రోజుల్లో ఏకంగా భీకర గాలుల మధ్య ఓ పైలెట్ విమానాన్ని సురక్షితంగా దించాడు. ఆ గాలి కూడా ఎంత వేగంగా ఉందంటే విమానాన్ని కూడా అమాంతం విసిరేసేంతగా. ఇందులో అసలైన మరో అద్భుతం ఏంటంటే అదే సమయంలో విరిసిన రెయిన్ బో చివరి అంచుమీదుగా చీల్చుకుంటూ పైలెట్ విమానాన్ని దించడం.
జర్మనీలోని డసెల్ డార్ఫ్ ఎయిర్ పోర్ట్ లో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పటికే ఆ ప్రాంతంలో తుఫాను వచ్చి వెళ్లిపోయింది. కానీ, బలమైన గాలులు భీకరంగా వీస్తున్నాయి. అదే సమయంలో ప్రయాణీకులతో వచ్చిన జర్మనీ ప్యాసెంజర్ జెట్ విమానం సరిగ్గా రెయిన్ బో చివరి అంచున ఆగింది. అనంతరం దాన్ని చీల్చుకుంటూ రన్ వేపై ముందుకు వెళ్లింది. అత్యంత అరుదుగా కనిపించే ఇలాంటి దృశ్యం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.