వాషింగ్టన్ : ఒసామా బిన్ లాడెన్ ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను గడగడలాడించిన అల్‌ఖైదా నాయకుడు. ఓ ఉగ్రవాద సంస్థ నాయకుడి నివాసం ఎలా ఉంటుంది?. సాధారణ జీవితాన్ని వారు గడపగలుగుతారా? అనే సందేహాలు అందరికీ వస్తుంటాయి. 2011లో అమెరికా భద్రతా దళాలు అబోటాబాద్‌లో లాడెన్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే.
అమెరికాకు చెందిన సీఐఏ(సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) లాడెన్ ఇంటిలో దొరికిన కంప్యూటర్ నుంచి లభ్యమైన వివరాలను తాజాగా వెల్లడించింది. లాడెన్ కుటుంబం(భార్య, పిల్లలు, మనవళ్లు)కు చెందిన వీడియోలు ఇందులో ఉన్నాయి. లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు సారథ్యం వహిస్తున్న హంజా లాడెన్ చిన్ననాటి ఫొటో మాత్రమే ఇప్పటివరకూ బయటి ప్రపంచానికి తెలుసు. హంజా యుక్త వయసులో ఉన్న ఫొటోను కూడా సీఐఏ బయటపెట్టింది.
సీఐఏ విడుదల చేసిన వీడియోల్లో బిన్ లాడెన్.. సాధారణ జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. ఆరుబయట లాడెన్ పిల్లలు, మనవళ్ల ఆటపాటలు, ఇంటి నిండా కోళ్లు, ఆవులు, కుందేళ్లు, పిల్లులు.. ఇలా పల్లెటూరి వాతావరణంతో బిన్ లాడెన్ ఆనందంగా గడిపినట్లు అర్థం అవుతోంది. ఓ ఫొటోలో తుపాకీతో లాడెన్ మనవళ్లు వాటర్ బెలూన్లను కాల్చుతున్నారు. ‘వేర్ ఇన్ ది వరల్డ్ ఇజ్ ఒసామా’ అనే పేరుతో వచ్చిన సినిమా కూడా లాడెన్ కంప్యూటర్‌లో ఉనట్లు సీఐఏ తెలిపింది. దేశ భద్రత దృష్ట్యా కంప్యూటర్‌లో దొరికిన అన్ని ఫైళ్లను విడుదల చేయడం లేదని సీఐఏ తన ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment