ఫ్రాన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 42మంది మృతి
బోర్డియాక్స్: అచ్చం మొన్న నల్లగొండలో జరిగినట్లుగానే ఫ్రాన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని 42 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఫైర్ సర్వీసు సిబ్బంది తెలిపారు. ఓ నలుగురు తప్ప దాదాపు ఆ బస్సులో ఉన్నవారు, లారీలో ఉన్నవారంతా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వారంతా విహారా యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఉత్తర బోర్డియాక్స్లోని పిసెంగ్విన్ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుందని 1982 తర్వాత ఇంత భారీ ప్రమాదం చోటుచేసుకోవడం మళ్లీ ఇదే తొలిసారి అని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫ్రెంచ్ ప్రభుత్వం సత్వరంగా స్పందించింది.
వాయువేగంతో సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం ఏథెన్స్లో ఉన్న అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన మూలమలుపు వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికులు చెప్తున్నారు. వాహనాలు ఢీకొన్న వెంటనే భారీ స్థాయిలో మంటలు వ్యాపిండం వల్ల ఎవరూ బతికేందుకు అవకాశం లేకుండాపోయింది. ఈ నెల (అక్టోబర్) 8న నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మృతుల సంఖ్యలో తేడా ఉన్న ఫ్రాన్స్లో జరిగిన ఘటన కూడా అచ్చం అలాగే మూలమలుపు, వాహనాల వేగం కారణంగా చోటుచేసుకుంది.