
మరోసారి ఉత్తర కొరియా బొక్కబోర్లా..!
ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియా మరోసారి పరాభవాన్ని చవిచూసింది. మంగళవారం ఉదయం రెండు అణు క్షిపణులు పరీక్షించిన ఆ దేశానికి భంగపాటు ఎదురైంది. ఉత్తర కొరియా ఉదయం 5.20గంటల ప్రాంతంలో ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు విఫలమయ్యాయని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. గత జనవరిలో అణ్వాయుధ పరీక్షలు జరిపినప్పటి నుంచి ఈశాన్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
అంతటితో ఆగని ఆ దేశంలో శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాంలు, వివిధ క్షిపణులు పరీక్షిస్తూ ఇతర దేశాల ఆందోళనలను బేఖాతరు చేస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగిస్తుందని తెలిసి జపాన్ కూడా అప్రమత్తమైంది. తమ సరిహద్దులో ఒక్క మిసైల్ పడిన దానికి తగిన బుద్ధి చెప్పాలని తమ సైన్యానికి ఆదేశించింది. అయితే తాజా ప్రయోగం తర్వాత అలాంటిదేం ఇప్పటి వరకు జరగలేదని జపాన్ అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర కొరియా తన అణుపరీక్షలను వదిలేసి ఆలోచనేది చేసేందుకు సుముఖంగా లేనందున తాము అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తామని జపాన్ మరోసారి స్పష్టం చేసింది.
వరుస వైఫల్యాలు
తమ వద్ద జపాన్ లోని ఏ ప్రాంతంనైనా.. అమెరికాలోని ఏ ప్రాంతంనైనా ధ్వంసం చేయగల ముసుదాన్ అణుక్షిపణులు ఉన్నాయని చెబుతూ వచ్చిన ఉత్తర కొరియా వాటి పరీక్షల్లో మాత్రం ఇప్పటి వరకు విజయం సాధించలేదు. దాదాపు 20 నుంచి 30 ముసుదాన్ క్షిపణులు ఉత్తర కొరియా వద్ద ఉన్నట్లు దక్షిణ కొరియా చెబుతుంది. అయితే, వీటి సామర్థ్యం విషయంలో మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి. గత నెలలో నిర్వహించిన పరీక్షల్లో కూడా ఇవి విఫలం అయ్యాయి.