
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ కార్చిచ్చు లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా, 24మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూసౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాలకు మంటలు వ్యాపించడంతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన సందర్శకులు సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించగా, న్యూసౌత్ వేల్స్‌లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. కార్చిచ్చు ప్రాంతంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ విపత్తు కారణంగానే స్కాట్ మోరిసన్ భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. జనవరి 13 నుంచి 4 రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించాల్సి ఉంది. మరోవైపు ఆసీస్ మంటల ధాటికి పొరుగున న్యూజిలాండ్ దేశంలోని ఆకాశం ఎర్రగా మారిందంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మరోవైపు ప్రఖ్యాత గాలపోగస్ దీవుల్లోని ప్రాణులు కూడా ఆస్ట్రేలియా కార్చిచ్చుకి మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వేలాది కోలస్, కంగారూలు మంటల వేడికి చనిపోగా.. మిగిలిన ఉన్న వాటి సంరక్షణ ఎలా చేయాలో తెలీక పర్యావరణవేత్తలు, జీవశాస్త్రజ్ఞులు మదనపడుతున్నారు. ఆదివారం కొద్దిసేపు వర్షం పడటంతో మంటలు కాస్త చల్లారాయి. ఇప్పటికిప్పుడు పరిస్థితి చక్కబడే అవకాశం కనిపించకపోవడంతో.. స్థానిక ప్రజల సహకారంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం దావానలాన్ని చల్లార్చే పనిలో పడింది.
చదవండి: ఆస్ట్రేలియా ప్రధాని రాక వాయిదా
Comments
Please login to add a commentAdd a comment