
పరుగున వెళ్లిన పిల్ల ఏనుగు ఏం చేసిందంటే...
ఏనుగుకు, మనిషికి ఉండే అనుబంధం చాలా గొప్పది. దీని గురించి ఇప్పటికే చాలా సినిమాలు కూడా వచ్చాయి. అందులోనూ పిల్ల ఏనుగులైతే మనుషులకు మరీ త్వరగా చేరువ అవుతాయి. తమకు తెలిసిన మనుషులు ప్రమాదంలో ఉన్నారని భావిస్తే.. అవి ఎలా రియాక్ట్ అవుతాయో వివరించే వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటికి దాదాపు 22 లక్షల మందికి పైగా చూశారు.
డెరిక్ అనే ఏనుగుల శిక్షకుడు నీళ్లలో ఈదుతుండగా.. ఆయనేదో మునిగిపోతున్నాడని భావించిన ఖామ్ లా అనే ఓ ఏనుగు పిల్ల చకచకా నీళ్లలోకి వెళ్లిపోయి.. ప్రవాహాన్ని సైతం దాటుకుంటూ ఆయన దగ్గరకు వెళ్తుంది. అవతలి గట్టు వరకు వెళ్లి మరీ డెరిక్‌ను తన తొండంతో పట్టుకుని పక్కకు తీసుకెళ్తుంది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్కులో ఆవిష్కృతమైన ఈ దృశ్యం వీక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. జంతువులను మనం ప్రేమగా చూస్తే.. అవి మనకు రెట్టింపు ప్రేమను అందిస్తాయన్న విషయం దీంతో నిరూపితం అవుతోందతని అంటున్నారు.