మానవ శరీరంలో బ్యాక్టీరియా వర్తకం
న్యూయార్క్: కొనడం, అమ్మడం, ఇచ్చిపుచ్చుకోవడం లాంటి ఆర్థిక శాస్త్ర భావనలు కేవలం మానవులకే పరిమితం కాదని తేలింది. భూమ్మీద, మానవ శరీరంలో నివాసముండే సూక్ష్మజీవులు కూడా వాణిజ్య సూత్రాలను పాటిస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. సూక్ష్మజీవులు ఒకదానితో ఒకటి క్లిష్టమైన విధానాల ద్వారా ప్రతిస్పందిస్తాయని, ఇది అంత సులభంగా అర్థమయ్యేది కాదని పరిశోధకులు తెలిపారు. పెద్ద సమాజాలుగా ఉండే సూక్ష్మక్రిములు అణువులు, ప్రొటీన్ల పరస్పర మార్పిడి ద్వారా మనుగడ సాగిస్తాయని పేర్కొన్నారు.
తమ వృద్ధి కోసం సహచర బ్యాక్టీరియాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరించే సూక్ష్మక్రిములను ఆధునిక సమాజంలోని దేశాలతో సరిపోల్చవచ్చని అన్నారు. క్లారెమంట్ గ్రాడ్యుయేట్, బోస్టన్, కొలంబియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. ఈ స్థితిని ఆర్థిక శాస్త్రంలోని సాధారణ సమతౌల్య సిద్ధాంతంగా వారు అభివర్ణించారు.