'క్రిమినల్ దేశంతో చైనా చేతులు కలపొద్దు'
వాంకోవర్: భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్వేగభరిత ప్రసంగం బలూచిస్థాన్ పౌరులకు గట్టి ధైర్యాన్ని ఇచ్చినట్లుంది. మొన్నటి వరకు స్థానికంగా, ఇటీవల ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించిన ఆ ప్రాంతపౌరులు ఇప్పుడు ఏకంగా పాక్ తో సంబంధంపెట్టుకుంటున్న దేశాల్లో కూడా నిరసనలకు దిగుతున్నారు. తమ పరిస్థితి చూసి కూడా పాక్ తో సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం ముమ్మాటికి తమ హక్కులను ఉల్లంఘించడమే అని వారు నినదిస్తున్నారు. త్వరలోనే వరుసగా మూడు రోజులపాటు కెనాడలోని బలూచిస్థాన్ వాసులు చైనా విదేశాంగ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగనున్నారు.
మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఆందోళనలో పాక్తో చైనా సంబంధం పెట్టుకోవడాన్ని నిలదీయనున్నారు. ఈ ఏడాది జులైలో ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ పాక్ లో ఉన్న బలూచ్ వాసులు అష్టకష్టాలుపడుతున్నారని, వారు చిత్ర హింసలకు గురవుతున్నారని, వారికి స్వాతంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు పాక్ పై పీకల్లోతూ కోపంగా ఉన్న బలూచ్ వాసులు తమ గొంతును ప్రపంచానికి వినిపించడం మొదలుపెట్టారు. కెనాడాలోని చైనా కాన్సులేట్ ముందు నిర్వహించే ధర్నాలో 'బలూచ్ ప్రాంతంలో నేరాలు చేస్తున్న పాకిస్థాన్ భాగస్వామిగా ఉండటం చైనా మానుకోవాలి' అని తీర్మానం చేయనున్నారు. బలూచ్ ప్రాంతంలో పాక్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మానవత్వాన్ని హత్య చేస్తుందని, హింసాకాండను కొనసాగిస్తోందని వారంతా ఆందోళన చేస్తున్నారు. 'ది ప్రీ బలూచిస్థాన్ మూమెంట్(ఎఫ్బీఎం) అనే సంస్థ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది.