కరాచి: ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత చలనచిత్రాలను పాకిస్థాన్‌లో పూర్తిగా నిషేధించడం పైరసీ వేళ్లూనుకునేందుకు దారితీస్తుందని ఆ దేశ సినీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనతోనే సుమారు 50–60 శాతం ఆదాయం పొందే సినిమా థియేటర్ల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్ కళాకారులపై భారత్‌లో నిషేధం విధించిన పిమ్మట పాక్‌లోనూ భారత సినిమాల ప్రదర్శనను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సినిమా థియేటర్ల యజమానులు పాక్ ప్రభుత్వానికి సంఘీభావంగా నిలిచారని డాన్ పత్రిక పేర్కొంది. ‘ భారీగా ఆదాయం వస్తున్నా భారత సినిమాల ప్రదర్శనను నిలిపేయాలన్నది స్థానిక భాగస్వాముల అగత్య నిర్ణయం. భారత సినీ పరిశ్రమ వర్గాలు మా కళాకారులపై నిషేధం విధించకుంటే మేమూ ప్రతిచర్యకు పాల్పడం. భారత చలన చిత్రాలకు పాకిస్థాన్ మూడో అతిపెద్ద మార్కెట్ అన్న సంగతిని వారు మరవకూడదు’ అని లాహోర్‌లోని సూపర్ సినిమా జనరల్ మేనేజర్ ఖోరెమ్ గుల్తాసాబ్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం విడుదలైన వాటితో పాటు పాత చిత్రాలతో పాకిస్థాన్ లో థియేటర్లు నడిపిస్తున్నారు. గతేడాది కేవలం 6 పాక్ చిత్రాలే విడుదలయ్యాయి. ప్రస్తుతానికైతే వీక్షకుల సంఖ్య తగ్గకున్నా, నిషేధం దీర్ఘకాలం కొనసాగితే పాకిస్తాన్ చిత్రపరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందని థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
'సినిమాలపై నిషేధంతో పైరసీ ముప్పు'
Published Thu, Oct 6 2016 8:05 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement