శాంసంగ్ కంపెనీలో భారీ దోపిడీ | Bandits loot Samsung plant in Brazil | Sakshi
Sakshi News home page

శాంసంగ్ కంపెనీలో భారీ దోపిడీ

Published Tue, Jul 8 2014 7:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

శాంసంగ్ కంపెనీలో భారీ దోపిడీ

శాంసంగ్ కంపెనీలో భారీ దోపిడీ

శావో పౌలో: బ్రెజిల్‌లోని శావో పౌలోకు సమీపంలో గల శాంసంగ్ కంపెనీ ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా సినిమా పక్కీలో జరిగింది. బ్రెజిలియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన కాంపినాస్ వద్ద గల శాంసంగ్ ఫ్యాక్టరీలోకి దాదాపు 20 మంది సాయుధ దొంగలు చొరబడి  215 కోట్ల రూపాయల విలువైన 40 వేల సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను ట్రక్కుల్లో వేసుకుని మరీ పరారయ్యారు. నైట్‌షిప్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును ఫ్యాక్టరీకి కొంత దూరంలో దొంగలు హైజాక్ చేశారు.  బస్సులోని ఎనిమిది మందిని బందీలుగా పట్టుకున్నారు. వారి గుర్తింపుకార్డులు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఆరుగురిని గుర్తుతెలియని చోటుకు తరలించి, ఇద్దరితో ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు.

ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన తర్వాత బందీలను అడ్డుపెట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కున్నారు. ఉద్యోగుల నుంచి సెల్‌ఫోన్లు కూడా తీసుకున్నారు. ఏమీ జరగనట్లే ఉండాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు ఈ దోపిడీ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. దొంగలు మూడు గంటలపాటు ఫ్యాక్టరీలో తిరుగుతూ తీరిగ్గా పని కానిచ్చేశారు. ఈ సంఘటనలో ఉద్యోగులెవరూ గాయపడలేదని, ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో దశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీస్ లెఫ్టినెంట్ విటర్ చావస్స్  తెలిపారు. విలువైన వస్తువులున్న చోటికే దొంగలు వెళ్లారు. అంటే  ఈ దోపిడీ వెనక ఇంటిదొంగల పాత్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి గురైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల మొత్తం విలువను ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement