సరిహద్దు బిల్లుకు ఓకే | Bangladesh border issue cleared | Sakshi
Sakshi News home page

సరిహద్దు బిల్లుకు ఓకే

Published Fri, May 8 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Bangladesh border issue cleared

బంగ్లాదేశ్‌తో సరిహద్దు సమస్య పరిష్కారం
భారత్‌కు 510 ఎకరాలు.. బంగ్లాకు 10 వేల ఎకరాలు
 
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో 41 సంవత్సరాలుగా కొనసాగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఇరు దేశాలూ కొంత భూభాగాలను ఇచ్చిపుచ్చుకుని సమస్యను పరిష్కరించుకునేలా 1974లో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ఖరారు చేసుకున్న భూ సరిహద్దు ఒప్పందం అమలులోకి వచ్చేందుకు రాజ్యాంగ (119వ సవరణ) బిల్లును లోక్‌సభ అరుదైన రీతిలో ఏకగ్రీవంగా ఆమోదించింది.

సభలో ఉన్న 331 మంది సభ్యులూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో పార్లమెంటు ఆమోదం పొందిన వందో రాజ్యాంగ సవరణ బిల్లుగా ఇది రికార్డులకెక్కింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్ష స్థానాల వద్దకు వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సభాపక్ష నేత మల్లికార్జునఖర్గే, బీజేడీ, టీఎంసీ, అన్నా డీఎంకే నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. ఈ బిల్లు వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

ఒప్పందం ప్రకారం భారత్‌కు 510 ఎకరాలు, బంగ్లాదేశ్‌కు 10,000 ఎకరాలభూమి లభిస్తుందని.. అయితే ఈ లెక్కలు కేవలం అంచనాలు మాత్రమేనని తెలిపారు. భూ సరిహద్దులను ఖరారు చేయ టం వల్ల అక్రమ వలసలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్‌తో భారత్ పరిష్కరించుకోవాల్సిన ఏకైక సమస్య తీస్తా నదీ జలాల పంపిణీకి సంబంధించినదేనన్నారు. బంగ్లాదేశ్ నుంచి తిరిగివచ్చే భారత జాతీయుల పునరావాసం కోసం పశ్చిమబెంగాల్‌కు రూ. 3,008కోట్ల ప్యాకేజీని సుష్మా ప్రకటించారు.

ఇది దౌత్య విజయం: హసీనా
ఢాకా: ఇరు దేశాల సరిహద్దు సమస్యను పరిష్కరించేలా చరిత్రాత్మక బిల్లుకు భారత పార్లమెంటు ఆమోదం తెలపటం... ఒక పెద్ద దౌత్య విజయమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement