ఆగని హేతువాదుల హత్యలు
ఢాకా: ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్తున్న ఓ ఇంగ్లిష్ ప్రొఫెసర్ను ఐస్ఐస్ మిలిటెంట్లు శనివారం దారుణంగా చంపిన ఘటన బంగ్లాదేశ్లోని రాజ్షాహి పట్టణంలో చోటుచేసుకుంది. ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్లో వరుసగా లౌకికవాదులు, హేతువాదులైన బ్లాగర్లు, మేధావుల మీద దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రాజ్షాహీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఏఎఫ్ఎమ్ రెజవుల్ కరీమ్ సిద్దిఖీ(58)ను చంపారు.
యూనివర్సిటీకి వెళ్లడానికి ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వచ్చిన సిద్దిఖీని బైక్లపై వచ్చిన మిలిటెంట్లు పదునైన ఆయుధాలతో గొంతు కోసి, చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు.
సిద్దిఖీ దేహం రక్తపు మడుగులో పడిపోగానే.. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని ఆ దేశ మీడియా ప్రచురించింది. ప్రొఫెసర్ హత్యతో ఆగ్రహించిన విద్యార్ధులు నేరం చేసినవాళ్ల శిక్షించాలని యూనివర్సిటీ క్యాంపస్లో ర్యాలీ నిర్వహించారు. కాగా, ఈ హత్యను తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుందని యూఎస్కు చెందిన ఇంటిలిజెన్స్ గ్రూప్ తెలిపింది.