
ఐసిస్ ఎక్కడున్నా అణచివేస్తాం
వాషింగ్టన్: ఐసిస్ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా సరే వారిని అణచివేసే చర్యలను అమెరికా కొనసాగిస్తుందని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఐసిస్‌ను నిర్మూలించే పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆ దేశ భద్రతా దళాలను ఆదేశించారు. ఐసిస్ విస్తరణను అడ్డుకోవడం, దానిని నిర్మూలించడానికి చేపట్టే చర్యలపై అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులతో ఒబామా గురువారం భేటీ అయ్యారు. ఐసిస్ అనుబంధ, ఇతర ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వపాలన బలహీనంగా దేశాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి త్నిస్తున్నాయన్నారు. అలాంటి చోట్ల పాలన బలోపేతానికి , ఉగ్రవాదంపై పోరాడేందుకు తోడ్పడాలని భద్రతా మండలిని ఆదేశించారు.
ఐసిస్ అంటే ముస్లింలంతా కాదనే తన విధానాలను విమర్శిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేతలకు చురకలు ఆయన అంటించారు. ‘ముస్లింలను అవమానపరిచేందుకు రాజకీయ నాయకులకు అవకాశమివ్వడం కోసం మనం మన నాయకత్వాన్ని దృఢపర్చుకోవడం లేదు. అది మన విధానం కాదు. అది అమెరికాకు మంచిది కూడా కాదు..’ అని స్పష్టం చేశారు.