ఏ అధ్యక్షుడు చేయని సాహసం..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జపాన్ లో పర్యటించనున్నారు. జపాన్ లోని హిరోషిమా పట్టణాన్ని మే నెల చివర్లో ఆయన సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. ఒబామా పర్యటనకు విశేషం ఏముందనుకుంటున్నారా... అయితే ఓ విషయాన్ని కచ్చితంగా చెప్పాలి. హిరోషిమాలో పర్యటించనున్న తొలి అమెరికా ప్రధానిగా ఒబామా చరిత్ర సృష్టించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్‌లోని హిరోషిమాపై అగ్రదేశం అమెరికా అణుబాంబు దాడి జరిపిన విషయం ప్రపంచదేశాలకు తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆ దారుణ ఘటన జరిగి 71 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనపై జపాన్ (హిరోషిమా) నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా సరే ఒబామా మాత్రం ఈ పర్యటన విషయంలో తగ్గడం లేదట.
జపాన్ ప్రధాని షింజో అబెతో అమెరికా అగ్రనేత భేటీ అవుతారు. శాంతి, సెక్యూరిటీ అంశాలపై వీరు చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. అణు ప్రమాదాలు, అణ్వాయుధాలు లాంటివి మానవాళికి విపత్తు అనే అంశంపై వారు చర్చిస్తారు. మరోవైపు ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా హిరోషిమాలో పర్యటించేందుకు సాహసించలేదు. పెను విధ్వంసం సృష్టించిన అణుబాంబు దాడి ఘటనపై ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా తమకు క్షమాపణ చెబితే సరిపోదని, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ నిరోధానికి కృషి చేయాలని ఆ విషాధ ఘటన బాధితులు కోరుతున్నారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకిలోనూ అణుబాంబులు కురిపించి బీభత్సం సృష్టించింది.