
బొమ్మలతో ఆడుకోవడమంటే చిన్న పిల్లలకు సరదా.. వాటిని చూడగానే ఎంత మారాం చేసే వారైనా నిమిషంలో అట్టే సైలెంట్ అయిపోతారు. సంవత్సరం లోపు వయసున్న పిల్లలకు దాదాపు గిలక్కాయ వంటి చప్పుడు చేసే వస్తువులు ఇస్తుంటాం. ఆ వస్తువుల్లో పెద్ద తేడా ఉండదు. కానీ వాళ్లు పెరుగుతున్న కొద్దీ వారు ఆడుకునే బొమ్మల్లో తేడా వస్తుంటుంది. ఆడ పిల్లలైతే బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్, కిచెన్ సెట్లు, పెళ్లి కూతురు బొమ్మలను ‘ఇస్తుంటాం’. అదే మగ పిల్లలయితే కార్లు, బైకులు, ట్రక్కులను ‘ఇస్తుంటాం’.. అంతేనా..? మనమే ఇస్తుంటామా.. లేదా వారే అలా కోరుకుంటారా..? ఇలా బొమ్మలను ఎంచుకోవడం, ఆడ, మగ పిల్లలు వేర్వేరుగా పెరగడంలో సమాజం పాత్ర ఏమైనా ఉందా.. లేదా సహజంగానే ఆ ఎంపిక జరుగుతోందా..? ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని జంతువులపై బీబీసీ ప్రయోగం జరిపింది. ఎంపికలో తేడా అనాదిగానే ఉందని, మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇలాంటి ప్రవర్తనే ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలింది.
జెండర్ న్యూట్రల్ బొమ్మలు
లింగ వివక్ష చూపుతూ బొమ్మలు తయారు చేస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వస్తున్నాయి. ‘కిండర్ జాయ్’కూడా మగ పిల్లలకు, ఆడ పిల్లలకు వేర్వేరు బొమ్మలు తయారు చేస్తుండటంపై ఈ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లింగ వివక్షచూపే బొమ్మలు ఉండొద్దని.. అందరు పిల్లలకూ ఒకే రకమైన బొమ్మలు తయారు చేయాలని (జెండర్ న్యూట్రల్ టాయ్స్) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఆటలోనూ ఆడ, మగ
జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్స్, కార్లు, బైకులు, ట్రక్కులు ఇలా చాలా బొమ్మలను పరిశోధకులు ఉంచారు. బబూన్ కోతి పిల్లలను పరిశీలించినప్పుడు ఆడ కోతి పిల్లలేమో టెడ్డీబేర్ వంటి బొమ్మలతో ఆడుకున్నట్లు, మగ కోతి పిల్ల లేమో కార్లు, ట్రక్కులతో ఆడుకున్నట్లు గమనించారు. మిగతా జంతువుల్లో కూడా దాదాపు ఇలాంటి ప్రవర్తనే గుర్తించారు. ‘జంతువులు ఇలా చేస్తున్నాయంటే వాటికి ఎవరైనా నేర్పుతున్నారా? కాదుకదా సహజంగానే అవి ఎంచుకుంటున్నాయి. ఇలాంటి ప్రవర్తనే మానవు ల్లో కూడా అనాదిగా ఉంది. ఎవరూ నేర్పించట్లేదు. ఇది సహజమైన ప్రక్రియే’అని జీవ పరిణామ శాస్త్రవేత్త ప్రొ.బెన్ గారడ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment