
రెక్కల కాన్వాసుపై చక్కని చిత్రాలు
రవిగాంచని స్థలమును కవిగాంచున్ అన్నారు పెద్దలు. కళాహృదయం, తపన ఉండాలేగానీ చిత్తరువులు గీయడానికి బోర్డులతో, కాన్వాసులతో పనేముంది. తోచినచోట వేసేయొచ్చు. సరిగ్గా అదే పనిచేశాడు మెక్సికోకి చెందిన కళాకారుడు రమోస్. తొలుత మిఠాయిలు, పేస్టులపై కళాఖండాలను చెక్కి ఔరా అనిపించుకున్న రమోస్‌కి ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. అదేమిటంటే సీతాకోకచిలుకల రెక్కలపై సిత్రాలు గీయాలని. వచ్చిందే తడవుగా సీతాకోకచిలుకల రెక్కలను సేకరించి పని ప్రారంభించాడు.
12 సెంటీమీటర్ల పొడవున్న రెక్కలపై 56 గంటలపాటు శ్రమించి చెక్కిన చిత్రాలు చూపరుల్ని కట్టిపడేశాయి. చిన్నప్పటి నుంచి తనకు సీతాకోకచిలుకలంటే ఇష్టమని, వాటి రంగులను చూసి మైమరిచిపోయేవాడినని రమోస్ చెప్పాడు. ఆ ఇష్టమే తనను వాటి రెక్కలపై చిత్రాలు గీసేలా చేసిందన్నాడు. పైగా ఇలా సీతాకోకచిలుకల రెక్కలపై పెయింటింగ్ వేసిన ప్రపంచంలోనే తొలి చిత్రకారుడిని తానేనని గర్వంగా చెప్పుకున్నాడు.