బేస్‌బాల్ బ్యాట్‌తో చితక్కొట్టిన బ్యూటీ.. అరెస్టు
న్యూయార్క్: ఓ పార్టీలో వ్యక్తిని బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టినందుకు అందాల భామ వానెస్సా బార్సెలో మిస్ మియామి లేక్స్ 2017ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులోనే ఆమె ఈ పని చేసినట్లు పోలీసులు చెప్పారు. వానెస్సా తన నివాసం హైలేహ్ అపార్టుమెంటులో పెద్ద మొత్తంలో పార్టీని ఏర్పాటుచేసి దానికి అతిథులను ఆహ్వానించిది. వచ్చిన అతిథుల్లో ఒకరితో గొడవపడింది. కాస్తంత మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ అతిథిని తన పార్టీలో నుంచి వెళ్లిపోవాలని గెంటేసింది. అతడు అలా వెళుతుండగానే ఆమెకు సంబంధించిన ఓ వ్యక్తి నేరుగా అతడిని మెట్లపై నుంచి తోసేశాడు.
అతడు కిందపడగానే పక్కనే ఉన్న అల్యూమినియం బేస్ బాల్ బ్యాట్‌తో వానెస్సా దాడి చేసింది. అతడి భుజాలపైనా, వీపుపైనా తీవ్రంగా కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ దాడిలో అతడి ఎడమ కన్ను చాలా దెబ్బతిన్నది. ఈ మేరకు హత్యాయత్నం పేరిట వానెస్సాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు సంబంధించిన న్యాయవాది మాత్రం ఆమె ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలోనే అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. మరోపక్క, ఈ ఘటనపై వానెస్సా స్పందిస్తూ కేసు దర్యాప్తులో ఉండగా మధ్యలో ఎలాంటి ప్రకటనలు చేయకూడదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.