గాయపడ్డ శ్రీహర్ష
సాక్షి, చందానగర్: ఇంట్లోకి చొరబడ్డ ఇద్దురు దుండగులు ఓ యువకుడిని కట్టేసి చితకబాదిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ అహ్మద్ పాషా కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన శ్రీహర్ష(28), నెల్లూర్ పట్టణానికి చెందిన సాయిరాం(30) నాలుగు నెలలుగా చందానగర్‌లోని ఇంజినీర్ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శ్రీహర్ష సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, సాయిరాం సోలార్ టెక్నికల్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి 7.30కి వీరింట్లోకి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. శ్రీహర్ష ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ‘సాయిరాంతో బిజినెస్ పనిపై వచ్చాం.. అతను వచ్చే వరకు ఉంటాం’ అని అన్నారు.
కొద్దిసేపటి తర్వాత మంచినీళ్లు కావాలని అడిగారు. నీళ్లు తెచ్చేందుకు కిచెన్‌లోకి వెళ్తున్న శ్రీహర్షపై వారిలో ఒకడు దాడి చేయడంతో నుదుటిపై గాయమైంది. ఇద్దరు అతడిని కుర్చీలోకి తోసి కాళ్లుచేతులు కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డ పెట్టి దాడి చేశారు. అనంతరం వెనుక డోర్ నుంచి పారిపోయారు. రాత్రి 9.30కి ఇంటికి వచ్చిన సాయిరాం కట్లును విప్పాడు. తర్వాత చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని, వారిలో ఒకడి పేరు మల్లి అని బాధితుడు తెలిపాడు. బాధితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఎవ్వరూ రాలేదని తేలిందని ఎస్‌ఐ తెలిపారు. మరే మార్గంలో వచ్చారా అనే
కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పగతోనే దాడి?
ఈ నెల 16న శ్రీహర్ష, సాయిరాంలకు వారి ఇంటి పరిసరాల్లో ఉండే తాళ్లపల్లి సౌరబ్‌గౌడ్(28)తో గొడవ జరిగిందని, చిన్న గొడవ కావడంతో మందలించి వదిలేశామని పోలీసులు తెలిపారు. శ్రీహర్ష, సాయిరాంలు సిగరెట్ తాగుతుండగా సౌరబ్ గౌడ్ వారిని హెచ్చరించడమే కాకుండా ఇంటికి వెళ్లి దాడి చేశాడని, అనంతరం కాలనీ కమిటీ సభ్యులు ఇరువురినీ పిలిచి సర్ధిచెప్పి పంపేశారన్నారు. కాగా, సౌరబ్‌గౌడ్ ప్రతీకారంతోనే ఇద్దరు వ్యక్తులను పంపించి దాడి చేశాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతడిని పిలిచి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment