న్యూఢిల్లీ : ఇక ఎవరైనా మూడు బీర్లు, ఆరు గ్లాసులతో ఛీర్స్ చెప్పాల్సిందే. ఇంతకాలానికి శాస్త్రవేత్తలు బీరులో ఉన్న మంచి గుణాలను కనిపెట్టారు. బీరు తాగితే కొత్తగా బొజ్జలు రాకపోవడమే కాకుండా బొజ్జలు కరిగిపోయి మొత్తంగా స్థూలకాయం తగ్గుతుందట. పైగా సుఖంగా నిద్ర పడుతుందట. వీటిలో ఒకరకమైన బ్యాక్టీరియా, ఈస్ట్ మిశ్రమం ఉండడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు.
అన్ని బీర్లలో ఈ గుణం ఉందో, లేదో తెలియదుగానీ బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్‌మల్లే ట్రిపల్, ఎట్ క్రైకెన్‌బియర్ బ్రాండ్‌ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు అబ్బాయట. భూగర్భంలో పులియడానికి ఒకరకమైన ఈస్ట్, సీసాలో పులియడానికి మరో రకమైన ఈస్ట్‌ను ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్నారని, ఈ రెండోసారి పులియడంతోనే బీరులో ఎక్కువగా ఆరోగ్య లక్షణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
వాటిలో కూడా లైట్ బీరుకన్నా స్ట్రాంగ్ బీరే మంచిదని, అలా అని ఎక్కువగా బీర్లు తాగమని తాను సిఫార్సు చేయడం లేదని ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్శిటీలో బ్యాక్టీరియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎరిక్ క్లాసెన్ చెప్పారు. ‘ఎక్కువ ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ రకమైన బ్రాండ్లలో రోజొకటి తాగినా ఆరోగ్యానికి మంచిదే. ఈ రకాల బీరు బాటిళ్లలో 50 శాతానికిపైగా మంచి బ్యాక్టీరియా ఉంది’ ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment