బేనజీర్ హత్య కేసులో ఇద్దరికి శిక్ష
బేనజీర్ హత్య కేసులో ఇద్దరికి శిక్ష
Published Thu, Aug 31 2017 5:07 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM
♦ ముషారఫ్ పరారీలో ఉన్నారన్న కోర్టు
♦ ఈ కేసు నుంచి ఐదుగురికి విముక్తి
రావల్పిండి: పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసులో ఇద్దరికి 17 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ఆ దేశ యాంటి టెర్రరిస్ట్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ను పరారీలో ఉన్నట్లు కోర్టు పేర్కొంది. బేనజీర్ హత్య జరిగిన పదేళ్ల తరువాత కోర్టు తీర్పును ప్రకటించింది. ఈ ఘటన సమయంలో రావల్పిండి పోలీస్‌కమిషనర్‌గా ఉన్న సౌద్ అజీజ్‌తోపాటు రావల్పిండి పట్టణ ఎస్పీ ఖుర్రం షహ్‌జాద్‌కు చెరో 17 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది.
ఈ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న రఫీక్ హుస్సేన్, హుస్సన్ గుల్, షేర్ జమాన్, ఇంతియాజ్ షా, అబ్దుల్ రషీద్‌లకు కోర్టు విముక్తి ప్రసాదించింది.పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి అయిన బేనజీర్ భుట్టో 2007 డిసెంబర్ 27న రావల్పిండిలో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆమెను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు బాంబు పేల్చడంతో బేనజీర్ మృతిచెందారు.
Advertisement
Advertisement