
‘బెర్ముడా ట్రయాంగిల్’.. ఎంతో కాలం నుంచి శాస్త్రవేత్తలకు పెను సవాలుగా.. సామాన్యులకు అత్యంత ఆసక్తికరంగా.. అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణించే ఓడలకు మృత్యు శాసనంగా మారింది. అసలు ఏముంది అక్కడ, ఇన్ని ఓడలు మునిగిపోవడానికి కారణమేంటి..? ఏలియన్‌లా.. లేక ఏదైనా బ్లాక్ మ్యాజికా.. ఇన్నాళ్లుగా సామన్యుల నుంచి శాస్త్రవేత్తల దాకా ఆలోచింపచేసిన ఈ మిస్టరీకి సమాధానం దొరికిందంటున్నారు సైంటిస్టులు. బెర్ముడా ట్రయాంగిల్ ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం ఏలియన్‌లో, కృష్ణబిలాలో కాదంట. మరి ఏంటి అనుకుంటున్నారా.. ‘అలలు’.
అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కేవలం అలల వల్లనే ఈ ప్రాంతం ఇంత ప్రమాదకరంగా మారిందంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రం అన్నాక అలలు సహజం. మరి ఏ సముద్రంలోనూ ఇలాంటి విపరీతాలు జరగడం లేదు కదా అంటే.. ఇక్కడ పుట్టే అలలు మాములు అలలు కాదంట. భారీ ఎత్తులో అంటే దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉద్భవించే అలలే ఇందుకు కారణమని తేల్చారు శాస్త్రవేత్తలు. వీటికి ‘రోగ్ వేవ్స్’గా నామకరణం చేశారు.
ఎక్కడుంది బెర్ముడా ట్రయాంగిల్
అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూర్టో రికో మధ్యన గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు. మృత్యువుకు మారు పేరుగా, ఓడలకు మరణశాసనంగా మారింది ఈ ప్రాంతం. అప్పటి వరకూ బాగానే ఉన్న వాతావరణ పరిస్థితులు బెర్ముడా వద్దకు చేరగానే ఒక్కసారిగా తారుమారవుతాయి. అసలు ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గత వందేళ్లలో దాదాపు 75 విమానాలు, లెక్కలేనన్ని నౌకలు అక్కడ గల్లంతయ్యాయి. ఈ రాకాసి ప్రాంతం ఇప్పటి వరకూ దాదాపు వెయ్యిమందిని తనలో కలుపున్నట్లు సమాచారం.
ఏలియన్లా.. కృష్ణబిలాలా..?
ఓడలు, విమానాలు గల్లంతువుతున్నాయి. ఆపైన వాటి ఆచూకీ కూడా లభ్యం కావడం లేదు. అసలు దీనంతటికి కారణం ఏంటి..? అనే అంశంపై ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు సముద్రంలో ఉండే పిరమిడ్లు కారణమంటే.. మరి కొందరు ఏలియన్లు కారణమని వాదించారు. అయితే ఇవేవీ నిజం కాదని అసలు నిజం వేరే ఉందని ప్రముఖ ఆంగ్ల టెలివిజన్ చానెల్5 వెల్లడించింది. ఈ రహస్యాన్ని చేధించే క్రమంలో పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడింది. ఎన్నో ప్రయోగాలు చేసి, డాక్యుమెంటరీని రూపొందించింది. చివరకు అసలు కారణాన్ని కనిపెట్టింది. అది ఏంటంటే.. దాదాపు 100 అడుగుల వరకు ఎగిసే ‘రాకాసి అలలే’ ఇన్ని ఘోరాలకు కారణమని తేల్చింది. వీటికి ‘రోగ్ వేవ్స్’ అని పేరుపెట్టింది.
రోగ్ వేవ్స్...
‘రోగ్ వేవ్స్’ పేరుకు తగ్గట్టుగానే ఇవి రోగ్ పనులే చేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. మాములుగా సముద్రాల్లో వచ్చే అలల కన్నా చాలా ఎత్తుగా.. ఒకదానివెంట మరొకటి అతివేగంగా విరుచుకుపడతాయంట. అయితే ఈ అలలు ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడడానికి కారణం.. సముద్రంలో ఒకేసారి వేరువేరు దిశల నుంచి చుట్టుముట్టే తుఫాన్లట. దాంతో అంతసేపు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ప్రళయ రూపం ధరిస్తుందట. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వాహానాలను నడపడం అంత తేలిక కాదంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణం మారడంతోనే ఆందోళన ప్రారంభమవుతుంది. దాని నుంచి బయటపడే లోపే అపార నష్టం జరుగుతుంది. ఈ భిన్నమైన పరిస్థితుల వల్లే బెర్ముడా ట్రయాంగిల్‌లో ఇన్ని ఓడలు మునిగాయంటున్నారు శాస్త్రవేత్తలు.
Comments
Please login to add a commentAdd a comment