bermuda triangle
-
Bermuda Triangle: మాయమైతే.. పైసలు వాపస్
న్యూయార్క్: బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని వ్యాపారంగా మార్చుకునేందుకు యూకేకు చెందిన ‘యాన్సియంట్ మిస్టరీస్’అనే సంస్థ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ‘బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లాక మాయమవుతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనిపించకుండా పోతే మీ డబ్బు 100% వాపస్ ఇస్తాం’అనిప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో నార్వేజియన్ ప్రిమా షిప్ న్యూయార్క్ నుంచి బెర్ముడాకు ప్రయాణం ప్రారంభించనుంది. ఆ ఓడ అడుగు భాగమంతా గ్లాస్‌తోనే తయారైందని చెప్పింది. క్యాబిన్ టికెట్ ఖర్చు ఒక్కరికి 1830 డాలర్లపైనే అని తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలోని 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లిన 75 విమానాలు వందల సంఖ్యలో ఓడలు కనిపించకుండా పోయాయి. -
విమానాలు మునిగిపోవడానికి కారణమేంటి..?
-
బెర్ముడా ట్రయాంగిల్.. మిస్టరీ వీడింది
‘బెర్ముడా ట్రయాంగిల్’.. ఎంతో కాలం నుంచి శాస్త్రవేత్తలకు పెను సవాలుగా.. సామాన్యులకు అత్యంత ఆసక్తికరంగా.. అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణించే ఓడలకు మృత్యు శాసనంగా మారింది. అసలు ఏముంది అక్కడ, ఇన్ని ఓడలు మునిగిపోవడానికి కారణమేంటి..? ఏలియన్లా.. లేక ఏదైనా బ్లాక్ మ్యాజికా.. ఇన్నాళ్లుగా సామన్యుల నుంచి శాస్త్రవేత్తల దాకా ఆలోచింపచేసిన ఈ మిస్టరీకి సమాధానం దొరికిందంటున్నారు సైంటిస్టులు. బెర్ముడా ట్రయాంగిల్ ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం ఏలియన్‌లో, కృష్ణబిలాలో కాదంట. మరి ఏంటి అనుకుంటున్నారా.. ‘అలలు’. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కేవలం అలల వల్లనే ఈ ప్రాంతం ఇంత ప్రమాదకరంగా మారిందంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రం అన్నాక అలలు సహజం. మరి ఏ సముద్రంలోనూ ఇలాంటి విపరీతాలు జరగడం లేదు కదా అంటే.. ఇక్కడ పుట్టే అలలు మాములు అలలు కాదంట. భారీ ఎత్తులో అంటే దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉద్భవించే అలలే ఇందుకు కారణమని తేల్చారు శాస్త్రవేత్తలు. వీటికి ‘రోగ్ వేవ్స్’గా నామకరణం చేశారు. ఎక్కడుంది బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూర్టో రికో మధ్యన గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు. మృత్యువుకు మారు పేరుగా, ఓడలకు మరణశాసనంగా మారింది ఈ ప్రాంతం. అప్పటి వరకూ బాగానే ఉన్న వాతావరణ పరిస్థితులు బెర్ముడా వద్దకు చేరగానే ఒక్కసారిగా తారుమారవుతాయి. అసలు ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గత వందేళ్లలో దాదాపు 75 విమానాలు, లెక్కలేనన్ని నౌకలు అక్కడ గల్లంతయ్యాయి. ఈ రాకాసి ప్రాంతం ఇప్పటి వరకూ దాదాపు వెయ్యిమందిని తనలో కలుపున్నట్లు సమాచారం. ఏలియన్లా.. కృష్ణబిలాలా..? ఓడలు, విమానాలు గల్లంతువుతున్నాయి. ఆపైన వాటి ఆచూకీ కూడా లభ్యం కావడం లేదు. అసలు దీనంతటికి కారణం ఏంటి..? అనే అంశంపై ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు సముద్రంలో ఉండే పిరమిడ్లు కారణమంటే.. మరి కొందరు ఏలియన్లు కారణమని వాదించారు. అయితే ఇవేవీ నిజం కాదని అసలు నిజం వేరే ఉందని ప్రముఖ ఆంగ్ల టెలివిజన్ చానెల్5 వెల్లడించింది. ఈ రహస్యాన్ని చేధించే క్రమంలో పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడింది. ఎన్నో ప్రయోగాలు చేసి, డాక్యుమెంటరీని రూపొందించింది. చివరకు అసలు కారణాన్ని కనిపెట్టింది. అది ఏంటంటే.. దాదాపు 100 అడుగుల వరకు ఎగిసే ‘రాకాసి అలలే’ ఇన్ని ఘోరాలకు కారణమని తేల్చింది. వీటికి ‘రోగ్ వేవ్స్’ అని పేరుపెట్టింది. రోగ్ వేవ్స్... ‘రోగ్ వేవ్స్’ పేరుకు తగ్గట్టుగానే ఇవి రోగ్ పనులే చేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. మాములుగా సముద్రాల్లో వచ్చే అలల కన్నా చాలా ఎత్తుగా.. ఒకదానివెంట మరొకటి అతివేగంగా విరుచుకుపడతాయంట. అయితే ఈ అలలు ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడడానికి కారణం.. సముద్రంలో ఒకేసారి వేరువేరు దిశల నుంచి చుట్టుముట్టే తుఫాన్లట. దాంతో అంతసేపు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ప్రళయ రూపం ధరిస్తుందట. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వాహానాలను నడపడం అంత తేలిక కాదంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణం మారడంతోనే ఆందోళన ప్రారంభమవుతుంది. దాని నుంచి బయటపడే లోపే అపార నష్టం జరుగుతుంది. ఈ భిన్నమైన పరిస్థితుల వల్లే బెర్ముడా ట్రయాంగిల్లో ఇన్ని ఓడలు మునిగాయంటున్నారు శాస్త్రవేత్తలు. -
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఇదేనా?
లండన్: పెద్ద పెద్ద నౌకలతోపాటు ఆ మార్గం గుండా ఆకాశమార్గాన ప్రయాణిస్తున్న విమానాలను కొన్ని క్షణాల్లోనే మింగేసి సముద్ర గర్భంలో దాచేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ గురించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోని నార్వే తీరానున్న బేరెంట్స్ సముద్ర గర్భంలో కిలోమీటరు వెడల్పు, 150 అడుగుల లోతైన క్రేటర్స్ (గొయ్యిలాంటి అగ్నిబిళ ముఖద్వారాలు) అనేకం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ క్రేటర్స్‌కు అడుగుభాగానున్న సహజవాయువుల నుంచి విపరీతంగా మిథేన్ గ్యాస్ వెలువడుతోందని, ఈ గ్యాస్‌కు పేలుడు స్వభావం ఉన్నందున అప్పుడప్పుడు పేలుళ్లు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుడు సంభవించి మిథేన్ గ్యాస్ మండిపోయి ఆ ప్రాంతంలో ఏర్పడిన శూన్యాన్ని నింపడం కోసం సముద్ర జలాలు ఒక్కసారిగా క్రేటర్స్లోకి చొచ్చుకుపోవడం వల్ల భారీ నౌకలు కూడా మునిగిపోతున్నాయని వారు అంచనా వేశారు. కొన్ని సందర్భాల్లో మంచుగడ్డ రూపంలో ఉన్న మిథేన్ గ్యాస్ కూడా తగులబడి పోవడం శూన్యం మరింత విస్తరిస్తున్నట్లుగా వారు అభిప్రాయపడ్డారు. విమానాలు కూలి పోవడానికి కూడా మథేన్ గ్యాస్ మండిపోవడంతో ఏర్పడిన శూన్యమే కారణమా? అన్న అంశాన్ని ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని వారంటున్నారు. ఏదేమైనా క్రేటర్స్ను కనగొనడం ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనని వారు చెబుతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ బ్రిటన్ అంతర్జాతీయ జలాల ప్రాదేశిక ప్రాంతం నుంచి ఫ్లోరిడా తీరంలోని ప్యూర్టోరికా వరకు విస్తరించి ఉంది. -
వామ్మో.. బెర్ముడా!
అది 1945, డిసెంబరు 5... సమయం: మధ్యాహ్నం 2.10 గంటలు.. స్థలం: ఫ్లోరిడాలోని నావల్ ఎయిర్ స్టేషన్.. టీబీఎమ్ అవెంజర్స్ రకానికి చెందిన 5 బాంబర్ విమానాలు ‘ఫ్లైట్-19’ అనే కోడ్ నేమ్‌తో రోజువారీ శిక్షణలో భాగంగా టేకాఫ్ తీసుకున్నాయి. అవి బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. దాని కెప్టెన్ నుంచి ఓ సందేశం వచ్చింది. '‘మేము తెల్లటి నీటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నాం.. దిక్సూచీలు పనిచేయట్లేదు. మేం ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు'' అని. తర్వాత రాడార్‌పై విమానాలు కనిపించలేదు. అందులో ప్రయాణిస్తున్న 13 మంది సిబ్బంది, ఆ విమానాలు ఏమయ్యాయో నేటికీ తెలియలేదు. అయితే, వాటి అదృశ్యానికి బెర్ముడా ట్రయాంగిల్‌కు ఉన్న సంబంధమేంటి? బెర్ముడా ట్రయాంగిల్ వాయవ్య అట్లాంటిక్ ప్రాంతంలోని ఒక అంతుచిక్కని ప్రాంతం. దీన్నే 'డెవిల్ ట్రయాంగిల్’ అని కూడా పిలుస్తారు. వందల ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏదో జరుగుతోందన్న వాదనలు, ఆందోళనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి వచ్చిన ఓడలు, విమానాలు గల్లంతవడం, అందులోని మనుషుల జాడ కూడా తెలవకపోవడంతో ఇది మిస్టరీ ప్రాంతంగా మిగిలిపోయింది. ఇప్పటిదాకా 30 ఓడలు, 40 దాకా విమానాలు ఈ ప్రాంతంలో కూలాయి. బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలోకి రాగానే భారీ ఓడలు, విమానాలు అనూహ్యంగా అదృశ్యమవడం, కనీసం వాటి ఆనవాళ్లు కూడా లభించకపోవడం వెనక అనేక కథలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఏదో శక్తి ఉందని, గ్రహాంతర వాసులు ఇదంతా చేస్తున్నారని ప్రజలు, రచయితలు రకరకాల వాదనలు చేస్తున్నారు. వీటిపై జరిగిన పరిశోధనలు మాత్రం అలాంటివాటికి ఆధారాలేం లేవని చెబుతున్నాయి. ఎక్కడుంటుంది? ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, కరీబియన్ దీవి ఇంకా అజెరాస్ తూర్పుభాగాన ఉన్న అరేబియన్ సముద్రం వీటి మధ్య విస్తరించిన ట్రెపిజాయిడ్ను కలిపి బెర్ముడా ట్రయాంగిల్’గా వ్యవహరిస్తారు. ఎక్కువ ప్రమాదాలు ఫ్లోరిడా తీరం, బహామా దీవుల్లోనే జరిగినట్లు చెబుతారు. ఇది చాలా రద్దీ ప్రాంతం. తరచు అమెరికా, యూరప్, కరీబియన్ దేశాలకు చెందిన పలు ఓడలు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో సముద్రం అడుగున ‘సాగర అంతర్వాహిని’(గల్ఫ్‌స్ట్రీమ్ ) ప్రవహిస్తుందని, అదే ప్రమాదాలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇక్కడ హఠాత్తుగా తుపానులు చెలరేగి వెంటనే సమసిపోతుంటాయి. మెక్సికో సింధుశాఖ నుంచి ఫ్లోరిడా జలసంధి దాకా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే ఒక అంతర్వాహిని. ఒకరకంగా చెప్పాలంటే.. ఇది సముద్రంలో ప్రవహించే ఒక నది అన్నమాట. అడుగున ప్రవాహం ఉన్నపుడు ఉపరితలంలో ఉన్న ఓడలను లాక్కోవడం వింతేమీ కాదు. అవి మరో చోట తేలడంలో విచిత్రమేం లేదు. ఇక్కడ అకస్మాత్తుగా చెలరేగే అలలు కూడా పడవలు మునగడానికి, అదృశ్యమవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొలంబస్కూ అనుభవమే! ఈ ప్రాంతంలో అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయని క్రిస్టఫర్ కొలంబస్ రాశాడు. ఇక్కడ క్షితిజ రేఖలో ఏవో వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచీ కొలతలు సైతం అసంబద్ధంగా, అసాధారణంగా ఉన్నాయని 1492, అక్టోబరు 2న తన లాగ్‌బుక్‌లో రాశాడు. కొలంబస్ అనుమానాలకు ఆధునిక శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చూసిన వెలుగులు అక్కడ దీవి వారు వంట చేసుకుంటే వచ్చిన వెలుగులుగా చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతోందన్న విషయం తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు పర్యటించారు. వారికి అక్కడ అసాధరణంగా ఏదీ కనిపించలేదు. కానీ, కొన్ని ఆసక్తికర విషయాలు వారి దృష్టికి వచ్చాయి. ఆ ప్రాంతంలో బలమైన సుడిగుండాలు ఏర్పడతాయి. ఇవి జలాల ఉపరితలాలపై కాకుండా, అంతరపొలాల్లో ఏర్పడటం గమనార్హం. ఇవి ఒక్కోసారి 200 కిలోమీటర్ల మేర వ్యాసార్థంలో ఉండటం గమనార్హం. భ్రమణంలో ఉన్న వస్తువుపై ఎలాంటి భూమ్యాకర్షణ శక్తి పనిచేయదు. కాబట్టి. ఈ సుడిగుండాల్లో చిక్కిన ఓడలు, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు వీటిలో చిక్కుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అన్నీ అభూత కల్పనలే: క్వొశ్చె బెర్ముడా ట్రయాంగిల్‌కు సంబంధించిన వెలువడుతున్న సంచలనాలపై ఆరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ క్వొశ్చె పరిశోధన చేశాడు. 1975లో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అనే పుస్తకం ప్రచురించాడు. అక్కడ జరిగే ప్రమాదాలు అసాధారణమైనవి కాదని స్పష్టంచేశాడు. అలాంటివి ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని చెప్పాడు. రచయితలు, మీడియా వ్యక్తులు అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేశారని వాదించాడు. అవన్నీ సంచలనాల కోసం చేసిన ప్రయత్నాలుగా తన పుస్తకంలో అభివర్ణించాడు. అక్కడ జరిగిన ప్రమాదాలలో కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల సంభవిస్తే..మరికొన్ని మానవ తప్పిదాల వల్ల జరిగాయని వివరించాడు. బెర్ముడా ట్రయాంగిల్‌తో సంబంధం లేని ఘటనలను కూడా దానితో ముడిపెట్టి రాశారని ఆరోపించాడు. అంతేకాకుండా వాటికి బెర్ముడా ట్రయాంగిల్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆధారాలతో పేర్కొన్నాడు. -సాక్షి, స్కూల్‌ఎడిషన్